నా బేసిక్ ఎలక్ట్రానిక్స్ కథ
ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మాకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్టు ఉండేది. అందరూ అది ఈజీ సబ్జెక్ట్ అనుకుంటూ ఉంటే నాకు మాత్రం ఒక కొరకరాని కొయ్యలా ఉండేది. అసలు మా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ ECE సబ్జెక్టు ఎందుకు అని ప్రశ్నించాలని ఉండేది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్లక్కూడా మా CSE సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి. మామూలుగానే క్లాసులకు వెళ్ళడం పెద్దగా ఇష్టం లేని మనం, ఈ సబ్జెక్టు కి మాత్రం ప్రొఫెసర్ క్లాసులు వినకపోతే గట్టెక్కడం కష్టం అనిపించింది. అందుకే BE క్లాసు ఉన్నప్పుడల్లా క్లాసుకు వెళ్ళేవాడిని. అసలే విని నేర్చుకునే శక్తి తక్కువైన నాకు, ఆ క్లాసు కూడా ఇంగ్లీషు లో కాకుండా స్పానిష్ లో వినిపించేది. కారణం ET సబ్జెక్టు. ఈ ET బాగా వస్తేనే BE బాగా అర్థమవుతుంది. ముందు సంవత్సరం ET ఈజీగానే పాస్ అయ్యాను కానీ పెద్దగా కమాండ్ రాలేదు. అలా ముక్కు మీద పెట్టుకుని ఎగ్జాంలో తుమ్మేసాను, పాస్ అయ్యాను. కానీ ఇప్పుడు BE వదిలేలా కనిపించడం లేదు. ప్రొఫెసర్ క్లాసులో అర్ధమైన ఏదో కొంచెం నోట్స్ లో రాసుకునే వాడిని. పరీక్షకి వారం ఉంది అనగా, నాకు ఉన్న నాలెడ్జ్ ఎగ్జామ్ గట్టెక్కడానికి సరిపోదు అనిపించింది. ...