అవరోహణం
అనంతపురం జిల్లాలో ఉన్న చానా ఊర్ల లెక్కనే యాలేరు కూడా వట్టిపోయిన భూములు, ఎండిపోయిన తుమ్మచెట్లు, అడుగంటి పారుతున్న పెన్నా వాగుతో నిర్జీవంగా ఉంటుంది. అలాంటి ఊర్లో కూడా బలిజయ్య చాలా చలాకీగా, హుందాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. పొద్దన్నే తన 20 ఎకరాల శనిక్కాయి చేనుకి వెళ్ళొచ్చి స్నానం చేసి ఊర్లో అరుగు మీద పెద్ద వేప చెట్టు కింద ఒక్కడే తెల్లబట్టలు వేస్కుని కూర్చుని చుట్ట కాలుస్తా అందర్ని నవ్వుతూ పలకరిస్తా ఉండేటోడు. ఆ నవ్వుకి కారణం ఆ శనిక్కాయి చేను యాదో లచ్చలు ఇచ్చేస్తాందని కాదు, అదిచ్చేది సంవత్సరానికి ఎనభై నూర్లే. కానీ బలిజయ్యకి ఎన్‌టీవోడు అంటే భలే ఇష్టంలే. ఆయప్ప సీయం అయ్యేతూరికి బలిజయ్య నవ్వు రెండింతలు అయ్యిండాది. అది చూసి చూసి కొందరికి అసూయ పుట్టింది. బలిజయ్యకి బౌ పొగురప్ప అనుకున్యారు. బలిజయ్య కూడా తక్కువేం కాదు, మాట్లేడేకి మంచిగా మాట్లాడతాడు కాని పెద్దోళ్ళు కనిపిస్తే దణ్ణాలు పెట్టడం. లేచి నుంచోవడం లాంటి పద్దతులేం తెల్వబడవ్. కానీ రోజూ మంచిగా అరుగుదగ్గర కూర్చుని తన పర బేధం లేకుండా, కల్మషం లేకుండా నవ్వుతాడు, మాట్లాడతాడు. ఓరోజు పొద్దన్...