తన్నేసిన మా నలభీమ పాకం

నేను భోజన ప్రియుడిని అని చెప్పక్కర్లేదు, నన్ను చూసిన వాళ్లకి ఇట్టే అర్థం అయిపోతుంది అది. అయితే మాలో ఎందరో భోజన ప్రియులు ఉన్నా నలభీములు మాత్రం ముగ్గురే. 🤪

ఒకటి నేను, నాయుడు (రమేష్ నాయుడు), సుబ్బు (సుబ్బు తోట). ఆ కథ ఏంటంటే...

అప్పటికి మేము CSE 4 కి వచ్చి కొన్ని నెలలే అవుతోంది. సుబ్బు, నేను S3 నుంచి వచ్చి ఒకే హాస్టల్ రూంలో పడ్డవాళ్ళం. నాయుడు మాత్రం వేరే రూం. కానీ కలిసి కలవగానే నాయుడు మన మనిషి అనిపించేసాడు. చాలా ఎనర్జీతో ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూనే ఉండేవాడు. 

మా మధ్య చాలా కామన్ పాయింట్స్ ఉండేవి. సినిమాలంటే నాలాగే పిచ్చి. ఇద్దరం కలిసి ఆ రోజుల్లో సినిమా గాసిప్ వెబ్సైట్లు అయిన తుపాకీ, గుల్టీ, గ్రేట్ ఆంధ్రా తెగ చదివేసేవాళ్ళం. సినిమా కబుర్లు చెప్పుకునే వాళ్ళం, అంతే కాదు, కామన్ గా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా.

ఆ సమయంలో నాయుడికి ఒక ఐడియా వచ్చింది. ఈ మెస్లో ఐటమ్స్ ఏవీ బాగుంటట్లేదు. మనమే స్టవ్ కొనుక్కుని, వండుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. అసలే భోజన ప్రియులం మనం, ఇక ఆగుతామా. సరే అన్నా. కాకపోతే నాకు అస్సలు వండడం రాదు. అదే చెప్పా, మాకు వచ్చు అన్నారు సుబ్బు, నాయుడు. 

ఇంకేం, మేము కొంత డబ్బులేసుకుని (పాపం నాయుడుకే ఎక్కువ ఖర్చు అయినట్టుంది)... నాయుడే విజయవాడ అంతా తిరిగి కష్టపడి ఒక ఇండక్షన్ స్టవ్ కొన్నాడు. అప్పట్లో 1500 అనుకుంటా అది. అదొక్కటే సరిపోతుందా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గుడ్లు, ఉప్పు, కారం ఇలా పాపం చాలా ఐటమ్స్ కొన్నాడు. కొనడం ఒక్కటీ సరిపోతుందా, వాటిని కాలేజీ లోకి తీస్కురావడం ఒక ప్రహసనం. చాలా రిస్కీ కూడా. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడో నాయుడే తెచ్చేసాడు. సుబ్బు హెల్ప్ చేశాడు. స్టవ్ ని మా రూంలో ఫిక్స్ చేశాం. 

ఒక శుభ ముహూర్తాన ఆమ్లెట్లతో రిబ్బన్ కట్ చేద్దాం అని మొదలెట్టాం ముగ్గురు నలభీములం. మెల్లగా ఉల్లిపాయలు తరగడం మొదలెట్టారు సుబ్బు, నాయుడు. నాకు కళ్ళు మండడం మొదలెట్టింది. అలా ఇలా కాదు, చాలా గట్టిగా మండుతోంది. సుబ్బు, నాయుడికి మండుతోంది కానీ నా అంత ఇబ్బంది పడలేదు ఇద్దరు. ఇక నేను అక్కడ ఉండలేక పోయాను. బయటకు వచ్చి చల్ల గాలిని, చల్ల నీటిని నా కళ్లకి తగిలిస్తే కానీ అవి కుదుటపడలేదు. మా ఇంట్లో వంట గది ఎక్కడో చివర. నేను పొరపాటున కూడా ఉల్లిపాయలు కోసెప్పుడు అసలు వెళ్ళేవాడిని కాదు. 

అది ఒక కారణం అనుకుంటా. అలా కాసేపయ్యాక రూంకి తిరిగి వచ్చా. ఎగ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్స్ రెడీ చేసారు. దాన్ని ఆమ్లెట్ వేస్కొడమే తరువాయి. కానీ స్టవ్ మీద పెట్టడానికి బాండీ లేదు మా దగ్గర. 🤭 బాండీ లేకపోతే ఎలా అని అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్ గా... స్టవ్ మీద డైరెక్ట్ గా వేసెద్దాం అని కమిట్ అయ్యాం. 🤪

అలా స్టవ్ మీదే డైరెక్ట్ గా ఒక ఆమ్లెట్ వేసి, అతుక్కుపోయిన దాన్ని తిరిగి తీయడానికి అష్ట కష్టాలు పడి... తీరా తింటే ఇంట్లో తిన్న ఆమ్లెట్లా అస్సలు లేదు ఇది. అసలు డబ్బులూ సరిగ్గా వేయలేదు, కుకింగ్ కూడా చేయలేదు మళ్ళీ వెధవ పేర్లు పెడతావా అంటారేమో అని, గమ్మునే కూర్చున్నా. 

రెండో ఆమ్లెట్. హాఫ్ బాయిల్డ్ వేద్దాం హాఫ్ బాయిల్డ్ వేద్దాం అన్నాడు నాయుడు. దానికైతే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అక్కర్లేదు అన్నాడు. హాఫ్ బాయిల్డ్ అంటే ఆర్య-2 లో వినడం తప్ప అదెలా వేస్తారో నాకు అస్సలు తెలీదు. సుబ్బు కి కూడా తెలీదు. నాయుడు ఉండి... సరే నేను వేస్తా అని ఎగ్ తీసుకుని స్టవ్ టాప్ మీద పగలకొట్టి, స్టవ్ మీద హాఫ్ బాయిల్డ్ వేశాడు. దాని మీద కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ వేశాక. తీసెద్దాం అలాగే తినాలి అన్నాడు. నిజానికి అది అలానే తినాలి. కానీ మనకు తెలీదుగా. తీసాక తింటే నాకు ఫ్యూజ్లు ఔట్ అయ్యాయి. 

అప్పటికి ఒక్కసారి కూడా హాఫ్ బాయిల్డ్ తినడం అలవాటు లేని నేను దాన్ని అరిగించుకొలేకపోయా. అప్పటికే దాదాపు గంట నుంచి మేము చేస్తున్న ఈ స్వయం పాకం యొక్క వాసన రూం మొత్తం నిండిపోయింది. అసలే ఆస్తమా పేషంట్ అయిన నేను, తలుపులు తీయండి బయటకు స్మెల్ మొత్తం వెళ్తుంది అన్నాను. 

తలుపులు తీసేసరికి ఆ వాసన ఖండ ఖండాంతరాలు దాటింది. ప్రతి ఒక్కరూ వచ్చి, ఏరా ఏం వండుతున్నారు అని... ఏరా ఏం చేస్తున్నారు అని అడగడం మొదలెట్టారు. ఇంతలో ఎవరో.. కింద ఉన్న జయ ప్రకాష్ సర్ కి స్మెల్ వచ్చింది. పైకి వస్తున్నారంట అని చెప్పారు. ఇక అంతే... స్టవ్ అక్కడే మూలన దాచేసి, దాని మీద గుడ్డ కప్పేసి ఉంచేసాం. రూంలోనుంచి అందరం ఎటోల్లు అటు పారిపోయాం. 

ఇలా జరిగిన వారం రోజులకు... యథావిధిగా, క్లాసులు వెళ్లకుండా హాస్టల్ రూంలో పడి నేను నిద్రపోతున్నా. మిగతా అందరూ క్లాసులకు వెళ్ళారు. ఇంతలో గట్టిగా విజిల్ వినపడింది. హాస్టల్ వార్డెన్ రైడ్ కి వచ్చాడు. నేను, నాతో ఇంకో 20 మంది దాంట్లో దొరికిపోయాం. మమ్మల్నందరిని హాస్టల్ బయట నించో బెట్టారు. నేను as usual గా నాకు హెల్త్ బాలేదని సాకు చెప్పా.

ఆ సమయంలో వార్డెన్ వచ్చి మమ్మల్ని అడిగాడు, "రేయ్ పైన ఉన్న వింగ్ లో ఎవరో స్టవ్ తెచ్చి వండుతున్నారు. ఏ రూం వాల్లో చెప్పండి" అన్నాడు. మా పైన ఫ్లోర్లో ఉండే సివిల్ వాడు ఒకడు ఉండి, సియస్ఈ వాళ్ళు సర్ అన్నాడు. నిజానికి ఆ సమయానికి మా సియస్ఈ లో మేము తప్ప ఎవ్వరూ స్టవ్ తెచ్చినట్టు నాకు తెలీదు. 

వెంటనే ఆయన సెక్యూరిటీ వాళ్ళని పంపి తాళాలు వెయ్యని రూమ్స్ లో స్టవ్వులు ఉన్నాయేమో వెతకమని పంపాడు. నా గుండె జారిపోయింది. నేను కిందకి వచ్చేప్పుడు మా రూం కి తాళం వెయ్యలేదు. హెల్త్ బాలేదు అని చెప్పి పైకి వెంటనే వచ్చేయోచ్చులే అని కిందకి వెళ్ళా. కానీ ఇప్పుడు అదే ప్రాణ సంకటం అయింది. 

చాలా సేపు పైన సియస్ఈ వింగ్ లో వెతికిన సెక్యూరిటీ, ఏదో స్టవ్ దొరికింది అంటూ గుడ్డ కప్పి ఉన్న స్టవ్ తెచ్చి అక్కడ పెట్టారు. ఇక నాకు జరగబోయేది కనపడింది. స్టవ్ తెచ్చినందుకు సస్పెన్షన్, కాలేజీ పోర్టల్లో నా పేరు, మా పేరెంట్స్ కాలేజీకి రావడం, మా నాన్న నన్ను... ఇంత తిండిపోతువెంట్రా నువ్వు అని అందరి ముందు కుక్కని తన్నినట్టు తన్నడం... అన్నీ అలా కం అండ్ గో లా వచ్చిపోతూ ఉన్నాయి. 

ఈలోపు ఎవర్ది ఆ స్టవ్, ఏ రూం వాళ్లది అని వార్డెన్ కనుక్కుంటున్నాడు. మమ్మల్ని పైకి వెళ్ళిపొమ్మని పంపేశారు. రూంకి నడుస్తున్నంత సేపూ గుండె 150 లో కొట్టుకుంటోంది. రూంకి వెళ్ళినా... మళ్లీ స్టవ్ దొరికిన రూం అని వచ్చి డైరెక్టర్ దగ్గరకి పట్టుకెళ్తారు అని సతమతం అవుతూ రూంకి వెళ్ళా. చూస్తే మా స్టవ్ అక్కడే ఉంది. 

దొరికిన స్టవ్ ఎవరో CSE1/CSE2 వాళ్ళది అంట. ఇక అదే ఆఖరు, మా నలభీముల స్వయంపాకానికి. స్టవ్ ఎవ్వరికీ కనపడకుండా ఏదో మూలన పెట్టేసి అలా వదిలేసాం. పాపం నాయుడి కష్టం అలా వృధా అయిపోయింది. సారీ నాయుడు, నీ కష్టం వృధా అవ్వడంలో మా పాత్రతో పాటు వార్డెన్ పాత్ర కూడా ఉంది. 😝

అదండీ మా తన్నేసిన నలభీమ పాకం కథ. 

(నాయుడు నేను ఇప్పటికీ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. పాలిటిక్స్ మీద పవన్ కళ్యాణ్ మీద. నా వరకు నాయుడు నేను ఒకటే అనిపిస్తుంది (అమ్మాయిల్లో తనకున్న క్రేజ్ తప్ప). నా పైత్యంతో నేను రాసే కథల్ని చదివే కొంతమందిలో మా నాయుడు కూడా ఒకడు. నా పెళ్లి అప్పుడు నాయుడ్ని చూసిన మా బంధువులు అందరూ... ఎవరా అబ్బాయి ఎవరా అబ్బాయి అని అడగడమే. చివరకి మా పెళ్లి వీడియో చూసినా ఎవరా అబ్బాయి అని అడుగుతూ ఉంటారు. నేను గర్వంగా చెప్తూ ఉంటా రమేష్ నాయుడు ఫ్రం ఆస్ట్రేలియా అని. Thank you Naidu 😃. నీకు ఇష్టం లేకపోయినా సరే, నువ్వు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయి... నువ్వు ఆస్ట్రేలియన్ సిటిజన్ అయిపోయి.. మన జనసేన NRI వింగ్ లో మెంబర్ వి అవుతావని ఆశిస్తూ 😉 ఇట్లు ఛత్రం)




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం