"Miss"understanding కథ

అవి నా 5వ తరగతి రోజులు. బాల ఛత్రం గాడు 5వ తరగతిలోనే బరితెగించి తిరుగుతున్న రోజులవి. మా స్కూల్లో ప్రతి ఇయర్ వాళ్ళకి 3 సెక్షన్లు ఉండేవి. A సెక్షన్ - అంటే అమ్మాయిల సెక్షన్. అందులో ఉండేది అమ్మాయిలు మాత్రమే. B సెక్షన్ - అంటే బాయ్స్ సెక్షన్. అందులో అబ్బాయిలు మాత్రమే. C సెక్షన్ వచ్చేసి చెత్త సెక్షన్ (నేను పెట్టిన పేరు) కొందరు డ్రాప్ అవుట్స్ కొందరు రీజాయినీస్ తో సగం అబ్బాయిలు సగం అమ్మాయిలతో కచర కచరా గా ఉండేది ఆ క్లాసు. 

మా స్కూల్లో వేరే సెక్షన్ అంటే అది వేరే స్కూల్ లానే. A సెక్షన్, B సెక్షన్ కలిపి బ్రేక్స్ ఎప్పుడూ ఇవ్వరు. వాళ్ళ క్లాస్ టైమింగ్ మా క్లాస్ టైమింగ్ అంతా వేరే. అసలు వాళ్ళను చూద్దామన్నా దొరకని పరిస్థితి. 

మనం B సెక్షన్ కి లీడర్. లీడర్ అనగానే లీడర్ మూవీలో రాణాలా హంబుల్ గా కాకుండా, రౌడీ అల్లుడులో చిరంజీవిలా ఫీల్ అయ్యేవాడిని. మా అందరి దృష్టిలో C సెక్షన్ అమ్మాయిలు అస్సలు బాగోరు, A సెక్షన్ అమ్మాయిలు బాగుంటారు. 

ఒకరోజు మా స్కూల్లో టీచర్లు అందరికీ ఏదో ఎలక్షన్ డ్యూటీ పడింది. తరవాతి రోజు డ్యూటీకి వెళ్తాము అనగా... ముందు రోజు (1st-4th) అన్నీ క్లాసులకు 5th క్లాసు పిల్లలని లీడర్లు గా పెట్టీ వెళ్ళారు. నేను 4th B కి లీడర్ గా చేయాలని వచ్చింది. ఛీ ఛీ అబ్బాయిల క్లాసుకు లీడర్ గానా, నేను చెయ్యను అని... ఎలక్షన్ డ్యూటీ రోజు టీచర్లు లేని టైంలో 4th A కి లీడర్ గా పడిన మా ఫ్రెండ్స్ తో, నా బ్యాచ్ స్వాప్ చేసుకున్నాం. చూడండి పట్టుమని పదేళ్లు కూడా లేని బాల ఛత్రం ఎలాంటి పనులు చేస్తున్నాడో. 

నేను అనుకున్నట్టుగా 4th A జూనియర్ అమ్మాయిల క్లాసుకు లీడర్ గా వెళ్ళాం. నేను, నాతో మా అబ్దుల్, నా ఫ్రెండ్ ప్రమోద్ వెళ్ళాం. వెళ్ళగానే మా చిల్లర స్టైల్లో మాలో మేము కుళ్ళు జోకులు వేస్కుని నవ్వుకుంటూ ఉన్నాం. మమ్మల్ని చూస్తున్న ఆ అమ్మాయిలకు ఏం అనిపించిందో ఏంటో వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుని తర్వాత గోల చేయడం మొదలెట్టారు. ఇక వీళ్ళని కంట్రోల్ చేయకపోతే లాభం లేదని, గట్టిగా అరిచి... బోర్డు మీద వాళ్ళ పేర్లు వేయడం మొదలెట్టా. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అదీ అలా రావాలి దార్లోకీ అని గర్వంగా ఫీల్ అయ్యి, ఆరోజు అంతా నా స్టైల్ ఆఫ్ రౌడీ అల్లుడు లీడర్ షిప్ చేశా. 

తర్వాత రోజు టీచర్లు అందరూ యధావిధిగా వచ్చేశారు. మేమూ మామూలుగా క్లాసుకు వెళ్ళాం. కాసేపటికి ఎవరో వచ్చి "నిన్న 4th A కి లీడర్స్ గా వెళ్ళినోళ్లని మేరీ టీచర్ గారు పిలుస్తున్నారు" అని చెప్పారు. 

మేరీ టీచర్ గారు 4th A కి క్లాస్ టీచర్. ఆవిడంటే మా స్కూల్లో పిల్లలు అందరికీ హడల్. కోపం వచ్చిందంటే తెగ బాదేస్తారు. ఆవిడ ఎందుకు పిలిచిందిరా భగవంతుడా అని మేము ముగ్గురం భయపడుతూ ఆవిడ దగ్గరకు వెళ్ళాం. 

మేము వెళ్ళేసరికి కర్ర పట్టుకుని క్లాసు బయట నించుని ఉంది. మేము ముగ్గురం వరసలో ఆవిడ ముందు నించున్నాం. 

"నిన్న క్లాసుకు లీడర్స్ మీరేనా?" అంది. 

"అవును మేడం" 

"మీరు వెళ్లాల్సింది 4th B కి అయితే A సెక్షన్ కి ఎందుకు వచ్చారు?" అంది. 

గుండె గుభేలు మంది. ఎవడో లీక్ చేశాడు అనుకుంటూ, "మా ఫ్రెండ్స్ ఏ స్వాప్ చేయమన్నారు" అని చెప్పా. 

ఆవిడ వెంటనే "మీకు ఈ వయసుకే తెంపరితనం ఎక్కువైయింది రా" అంటూ కర్ర తీసుకుని నా పక్కన ఉన్న ప్రమోద్ ని కొట్టింది. 

"మీకు టీచర్లు అంటే అస్సలు గౌరవమే లేదురా. నన్ను గొర్రె అని అంటారా. కుంటి దానిలా నడుస్తా అంటారా" అంటూ ఇటు పక్కన ఉన్న అబ్దుల్ గాడిని కొట్టడం మొదలెట్టింది. 

మేము షాక్. అసలు మేము ఆవిడ మీద జోకులు వేస్కున్న పాపాన పోలేదు. 

"మేడం మేం అనలేదు మేడం. మాకు తెలీదు" అంటున్నా వినకుండా అటు ప్రమోద్, ఇటు అబ్దుల్ గాడిని తెగ వాయించేసింది. 

"మేడం మీకు ఎవరు చెప్పారో చాలా తప్పు చెప్పారు" అన్నా ధైర్యం చేసి. 

"మా క్లాసు అమ్మాయిలు, రాగానే మీరు చేసిన గోల అంతా చెప్పారు నాకు" అంది.

అప్పుడు అర్థమయింది. నిన్న నా రౌడీ అల్లుడు లీడర్ షిప్ కి ఇరిటేట్ అయ్యి ఆ క్లాసు అమ్మాయిలు పగతో అబద్ధాలు చెప్పి మమ్మల్ని బుక్ చేశారని. అబ్దుల్ గాడిని ప్రమోద్ ని కొట్టి కొట్టి... ఒక్కసారిగా ఆపింది. 

"మీ ఇద్దరు వెళ్ళిపోండిరా" అంటూ వాళ్ళిద్దరినీ పంపేసింది. 

"నువ్వే దీని అంతటికీ సూత్రధారివి అని నాకు తెలుసు. నువ్వు స్కూల్ ఫస్టు అయినంత మాత్రాన ఏమైనా దార్కారీ నా? మీ అమ్మ పక్క స్కూల్లో పనిచేస్తుంది అంట కదా. రేపెళ్ళి మీ అమ్మను స్కూల్ కి తీస్కురా" అంది. 

నేను ఇంటికి వెళ్ళా. మేరీ టీచర్ నిన్ను రమ్మంటోంది అని మా అమ్మకు చెప్పా. మా అమ్మ ఏదో పనిలో ఉండి మా నాన్నని పంపించింది. మా నాన్న వస్తే... ఆ టీచర్ సరాసరి మా ఇద్దర్నీ HM రూంకి తీస్కెళ్ళింది. HM కి ఉన్నవి లేనివి మొత్తం చెప్పింది. HM నా చెయ్యి పట్టమని, మా నాన్న ముందే పెద్ద బెత్తం తీసుకుని గట్టి దెబ్బ వేసింది. నా లైఫ్లో టీచర్లు నన్ను కొట్టడం అదే మొదటిసారి. ఇక ముందు ఇలాంటివి రిపీట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపేసింది. 

ఇక ఇంటికి వెళ్ళాక, "నువ్వు ఈ వయసుకే ఇలా తయారయ్యావా" అంటూ మా అమ్మ నాన్న ఇద్దరు నన్ను గట్టిగా ఉతికారు. ఇదివరకు మా అమ్మ నాన్న నన్ను విడివిడిగా వాయించారు కానీ, కలిసి కుమ్మడం అదే మొదటిసారి. ఒక శివమణి జాజ్ కొట్టినట్టు, ఒక తమన్ EDM వాయించినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు... ఒకటే కొట్టుడు తిట్టుడు. అలా ఇద్దరి చేతిలో తన్నులు తిన్న నేను ఒక గట్టి డెసిషన్ తీస్కున్నా. దాని గురించి వేరే ఆర్టికల్ రాస్తాలేండి.

అలా ఎవరో చెప్పిన మాటలు విని మేరీ టీచర్, HM, మా అమ్మ, నాన్న అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలా నా వాలకం చూసి నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు బోలెడు. నేనేదో స్వామీ వివేకానంద అని చెప్పను, కానీ దావూద్ ఇబ్రహీం అయితే కాదు. ఇలాగే...

ఒకసారి కాలేజీలో ఒక క్లాసులో ముందు నిలబడి మాట్లాడుతూ, ఒక అమ్మాయిని చూసి "నాకు చెల్లి ఉంటే ఇలానే ఉంటుందేమో" అని చెప్పా. అది నిజంగా heartful గా చెప్పా. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ తరపు వాళ్ళు అందరూ హైట్. అందరూ కొంచెం ఫెయిర్ గా ఉంటారు. ఈ అమ్మాయి కూడా తెల్లగా హైట్ గా ఉంటుంది.

తరవాత ఎప్పుడో ఆ అమ్మాయి "ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఇష్టపడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కి నన్ను సెట్ చేయడానికే ఇలా చెల్లి అని చెప్పాడు" అని చెప్పిందట. నిజానికి నాకు అలాంటి ఐడియా కూడా లేదు. అసలు ఆ అమ్మాయికి నేను ఏనాడు కాల్ కూడా చేయలేదు. జస్ట్ మనసులో ఉన్న మాట చెప్పా. అదేమో ఫైనల్ గా అలా టర్న్ అయింది. మన ఫేసే చిచ్చోరే గాడిలా ఉంటుందేమో. అందుకే ఈ "మిస్" understandings అన్నీ. 

అదీ... నా చిచ్చోరే Miss'understanding' కథ. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం