ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసిచూడు - Part 1

ఇల్లు కట్టిచూడు పెళ్లి చేసిచూడు అనేది మన తెలుగు సామెత. మన పూర్వీకులు తాము చేసిన అన్నీ పనుల్లోకెల్లా ఈ పనులు చాలా కష్టమని నిర్ధారించి పెట్టిన సామెత అది. 

కింద ఒక పుల్ల పడితే దాన్ని ఇక్కడి నుంచి తీసి అక్కడ కూడా పెట్టలేనంత బద్దకం కలిగిన నేను అవి రెండు ఎలా చేశాను అన్నదే ఈ కథ. 

ఫస్ట్ పెళ్లి విషయానికి వద్దాం. ఇప్పుడు అందరి అబ్బాయిల పెళ్లి వయసు 30 అయిపోయింది. 30 కంటే ముందు ఎవ్వరూ పెళ్లి చేసుకోని సమయంలో నేను 25 కే చేసేస్కున్నా. లవ్ మ్యారేజ్ కాబట్టి దానికి కారణాలు బోలెడు. ఒక మెయిన్ రీజన్ మాత్రం నా ఆత్రం. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో అన్న ఆత్రంతో ఛత్రం గాడు త్వరగా పెళ్లి చేసుకున్నాడు. 

నిజానికి, నేను పుట్టినప్పటి నుంచి సినిమాల్లో తప్ప బయట ఒక్క పెళ్లి కూడా చూడలేదు...!!! ఇది నిజం. నిజంగా నిజం. మా బంధువుల్లో కూడా ఎవ్వరి పెళ్లి కూడా నేను అటెండ్ అవ్వలేదు. ఒక కారణం, ఎక్కువ పెళ్ళిళ్ళు రాత్రులు జరిగేవి. సో అసలే ఆరోగ్యం బాలేని నన్ను ఆ చలిలో తీసుకువెల్లేవాళ్లు కాదు మా అమ్మ నాన్న. ఇంకొకటి చదువు కారణం. మామూలుగా బయట జరిగే తంతులన్నీ చాలా ఎక్కువ సేపు జరిగేవి. అలా బయటే 3-4 గంటలు ఉంటే నా టైం వేస్ట్ అని ఫీలయ్యి ఇంట్లోనే పెట్టీ వెళ్ళేవాళ్ళు. తర్వాత కాలేజీకి వచ్చాక, ఉద్యోగం వచ్చాక, పెద్దగా ఎవ్వరినీ కలవని నేను... అసలు ఏ ఒక్క పెళ్లి చూడకుండా అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, మా బంధువులు అందరికీ సాంబయ్య, రాణి (మా అమ్మ నాన్న) లకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు అని తెలుసు కానీ వాడు ఎలా ఉంటాడో ఇప్పటికీ చాలా మందికి సస్పెన్స్. వాడు పొడుగ్గా ఉంటాడు, బాగా చదివేవాడు అనే తప్ప, మన రియల్ పిక్చర్ వాళ్ళకి తెలీదు. మా అన్నయ్య అందరితో కలివిడిగా ఉండేసరికి, వాడి గురించి అందరికీ తెలుసు. 

అలా, నా పెళ్లి వరకూ... సక్సెస్ ఫుల్ గా ఒక్క మ్యారేజ్ కూడా చూడలేదు నేను. నేను నా కళ్ళతో ఒక మ్యారేజ్ చూద్దాం అని వెళ్ళింది రీసెంట్ గా మా ఫ్రెండ్స్ మహేష్ - దివ్యల మ్యారేజ్ కి. ఆఖరికి ఆ పెళ్ళికి కూడా తాళి కట్టే ముందు వరకూ మేల్కొని ఉండి, తాళి కట్టే సమయానికి పైన రూంలో పడి నిద్రపోయా. 😴 

అలా ఒక్క పెళ్లి కూడా చూడని నేను, ద్వారకా తిరుమలలో మా పెళ్లి జరుగుతున్నపుడు లిటరల్ గా వణికాను. ఒక కారణం, హుందాగా కనిపించాలనే తపన. అసలే లవ్ మ్యారేజ్, అబ్బాయి చాలా బాగున్నాడు. చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నాడు అనుకోవాలనే ప్రయత్నం. ఇంకో కారణం, ఒక పెళ్లి జరగడానికి ఉండే రిక్వైర్మెంట్స్. అదేదో తాంబూలం బిళ్ళల దగ్గర నుంచి, వేసుకునే ఖద్దరు పంచల వరకు బ్రాహ్మణుడి దగ్గర నుంచి భయంకరమైన రిక్వైర్మెంట్స్. ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమైనదే ఒక పెళ్ళికి. I think పెళ్ళికి రూల్స్ రాయడమే అలా Tough and Hard గా ఉండేలా పెద్ద ప్రాసెస్ తో రాశారు అనుకుంటా. లేకపోతే మొలతాడు వేసుకున్న ప్రతోడు ఈజీగా తాళి కట్టేసి "ఇది పెళ్లే" అంటారని అనుకుంటా. 

ఆ పెద్ద ప్రాసెస్, రెండు గంటలు జరిగిందో మూడు గంటలు జరిగిందో నాకు గుర్తులేదు. కానీ చాలా గంటలే జరిగింది. 
ప్యాంట్ తప్ప కనీసం లుంగీ, పంచ కూడా అలవాటు లేని నేను ఒక ఖద్దరు పంచ ధరించడం జరిగింది. మన నలుపు రంగుకి, ఆ తెల్లటి ట్రాన్స్పరెంట్ పంచె వేసుకుంటే ఎలా ఉందో ఆ చూసినోళ్లనే అడగాలి. పంచె తో పాటు తలపాగా పెట్టుకోమన్నారు. అది పెట్టుకున్నాక నన్ను నేను ఒక శ్రీకృష్ణదేవరాయల్లా ఫీల్ అవ్వడం మొదలెట్టా. పంచె వేస్కుని కూర్చున్నాక ప్రాసెస్ మొదలయింది. 

ఏవో కొన్ని తీర్థాలు ఇచ్చి కొన్ని తాగమంటున్నారు, కొన్ని హోమగుండంలో పోయమంటున్నారు. ఈ ప్రాసెస్ మధ్యలో, ఒక తీర్థం ఇచ్చి హోమగుండంలో పోయమన్నారు. నేను గుటుక్కున నోట్లో పోస్కున్నా. చేసిన తప్పు రియలైజ్ అయ్యి పంతులు వైపు చూసా. ఒక్క క్షణం మంత్రాలు చెప్పే పంతులు ఆగిపోయాడు. నా వైపు హీనాతి హీనంగా ఒక పురుగుని చూసినట్టు చూసాడు. 

ఆ చెయ్యి పట్టు అంటూ ఏదో మంత్రాలు చదివి నీళ్ళు జల్లి చెయ్యి శుద్ది చేశాడు. "బాబు చెప్పింది జాగ్రతగా విని చెయ్యి" అన్నాడు. "సరే" అని బుద్దిగా తల ఊపి. ఆయన చెప్పింది జాగ్రత్తగా వింటూ నిదానంగా చేస్తూ ఉన్నా. మళ్ళీ కాసేపున్నాక ముహూర్తం టైంకి లేట్ అవుతోందని, "బాబు త్వరగా చేయాలమ్మా" అంటూ కంగారు పెట్టాడు. ముహూర్తం రానే వచ్చింది. 

ముహూర్తం వచ్చాక మొదలయింది అసలైన ఈవెంట్...
భాజాబజంత్రీల మధ్య తల మీద జీలకర్ర బెల్లం పెట్టించారు. ఒక్కొక్కటి ఒక కేజీ అంత చేసి పెట్టాడు పంతులు గారు. తల నిండా అవే ఉన్నాయి. ఇద్దరం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక వెంటనే తీయిస్తారులే అనుకున్నా. 2 నిమిషాలు అయింది, చెయ్యి ఇంకా తన తల మీదే ఉంది. 5 నిమిషాలు అయింది ఇంకా తీయనివ్వరే. వణికిపోతుంది నా చెయ్యి. నొప్పెట్టేస్తుంది. ఆ సమయంలో నిజంగా కిత కితలు సినిమాలో అల్లరి నరేష్ - గీతా సింగ్ సీన్ గుర్తొచ్చింది. 

మధ్యలో ఏమో ఫోటోగ్రాఫర్స్ గోల. మా ఫోటోగ్రాఫర్ ఏమో, వణుకుతున్న నా చెయ్యి కింద నుంచి ఫోటో తీస్తున్నాడు. ఆ తల మీద ఉన్న కేజీ జీల కర్ర బెల్లం మా చెమట తో కలిసి, మా మొహాల మీదకి పచ్చగా ఏదో పసరు కారినట్టు కారుతూ ఉంది. "సర్ తుడుచుకొండి సర్" అంటున్నాడు ఫోటోగ్రాఫర్. సర్లేవయ్య అంటూ తుడుచుకున్నాను. 

ఇంతలో ఏదో చెప్పి నిలబడమని మళ్ళీ కూర్చోబెట్టాడు పంతులు గారు. హమ్మయ్య చెయ్యి తీయించాడు ఇప్పటికైనా అనుకుంటూ... ఆ పంచె కట్టుకోవడం అస్సలు అలవాటు లేని నేను ఎలాగో లేచి కూర్చున్నా. ఇంతలో ఫోటోగ్రాఫర్ పక పక నవ్వుతున్నాడు. ఏమిటా అని చూసా. "సర్ పంచె సరిచేస్కొండి సర్" అని నవ్వుతున్నాడు ఫోటోగ్రాఫర్. అప్పుడు అర్ధం అయింది నాకు ఏం జరిగిందని. తల పక్కకి తిప్పి చూసాను, నా భార్య తరపు వాళ్ళు ఎవరో అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఎదురుగా చూసాను, దూరంగా మా అమ్మ వాళ్ళు నవ్వుకుంటున్నారు. పరువు క్లియర్ గా పోయింది అని అర్థం అయింది. it's part and parcel of my life అనుకుని సంభాళించుకున్నా. 

కాసేపటికే తాళి కట్టే సమయం వచ్చింది. తాళి కట్టే టైంలో, నాకు తాళి క్లియర్ గా పట్టుకుని చూపించాడు పంతులు. బాబు తాళి బొట్టుకు ఉండే ఆ పాయింట్స్ పైకి చూస్తూ ఉండాలి. ఇలాగే నా చేతిలో ఉన్న తాళి తీసుకెళ్లి ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వెయ్యి అన్నాడు. అలాగే జాగ్రత్తగా ఆ తాళి తీసుకుని పద్ధతిగా మూడు ముళ్ళు వేసాను. 

తాళి కట్టాక, పంతులు వచ్చి చూశాడు "నీకు ఏం చెప్పాను. నువ్వు ఏం చేసావు" అన్నాడు. చూస్తే తాళి రివర్స్ లో ఉంది. నాకు అది అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఇలా అయితే ఎలా అయ్యా అంటూ ఏదో తిట్టుకుంటూ... ఇప్పుడు ఈ తాళి ఇలానే ఉంచండి. వారం తర్వాత తాడు తీసి కట్టెప్పుడు సరిగ్గా కట్టు అంటూ చిరాకు పడుతూ కూర్చున్నాడు. మరీ ఇన్ని తప్పులు చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. 🙃

చూడండి... జాగ్రత్తగా లేకపోతే నాలాగే మీక్కూడా జరిగేను పరువు భంగం. 🥱
ఇలా జరిగింది నా పెళ్లి ప్రహసనం. నా ఇంటి కష్టాలు next part లో...

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం