పుచ్చకాయ రోజులు 🍉

ఈ మధ్యనే ఒకరోజు Instagram చూస్తుంటే ఎవరో ఒక మలయాళం సినిమా బాగుంది అని పోస్టు పెట్టారు. సినిమా పేరు 'Thanneer Mathan Dinangal'. ఏంటబ్బా ఆ సినిమా అంటూ గూగుల్ చేశా. అది ఇంటర్మీడియట్ చదివే పిల్లల కథ. ఒక సరదా ప్రేమ కథ. ఎక్కడ చూసినా 8/10 రేటింగ్ ఉంది. ఈ మధ్య వరుసగా కొన్ని మలయాళం సినిమాలు చూసిన నాకు ఈ సినిమా చూడడం పెద్ద పని అనిపించలేదు. 


వెంటనే movierulz మావ బ్రో సహాయంతో లటుక్కున డౌన్లోడ్ చేసి, సాయంత్రం స్నానం అయ్యాక ప్రశాంతంగా కూర్చుని సినిమా మొదలెట్టా. సినిమాలో హీరో జేసన్ తన 11th Class కోసం కార్మెల్ అనే స్కూల్ నుండి కొత్తగా ఓ స్కూల్ కి వస్తాడు. రావడం రావడం అతి క్రమశిక్షణ, అతి బాధ్యత చూపిస్తాడు. టీచర్లందరికి జేసన్ చాలా ఇష్టం. కాకపోతే వీడు చేసే అతి, తోటి పిల్లలకు నచ్చదు. అందరూ వీడంటే గుర్రుగా ఉంటారు. 


ఇలా కొంతకాలం గడిచాక, ఒకరోజు క్లాసులో పరీక్ష పెడతారు. అది జేసన్ వచ్చాక ఆ స్కూల్లో రాసిన మొదటి పరీక్ష. అందులో 20 మార్కులకు జేసన్ కు 3 మార్కులు వస్తాయి. క్లాసులో చాలా మంది కంటే అది చాలా తక్కువ. దాంతో జేసన్ తో సహా క్లాసులో వాళ్ళు అందరూ చాలా షాక్ కి గురవుతారు. టీచర్లు, "ఏంటి జేసన్ నువ్వు ఇలా రాస్తావు అనుకోలేదు" అంటూ చీవాట్లు పెడతారు. వీడి ఓవర్ యాక్షన్ కి తగ్గట్టు భలే జరిగింది అని తోటి పిల్లలు నవ్వుకుంటారు. అప్పటి వరకు మొదటి బెంచ్ లో కూర్చునే జేసన్, మార్కుల ప్రకారం చివర బెంచ్ లకు వెళ్ళిపోతాడు. చివర బెంచ్ కు వెళ్ళాకే జేసన్ కు స్నేహితులు తయారవుతారు. 


ఇది చూడగానే... నాకు ఎక్కడో దీనిని చూసినట్టు అనిపించింది. చూసినట్టు కాదు చేసినట్టు. ఆ కథలో హీరోగా నేనే చేసినట్టు గుర్తొచ్చింది. 


అది 2008 రోజులు. అప్పుడే చిన్నప్పటి నుంచీ స్కూల్ ఫస్టుగా, టెన్త్ లో మండలం ఫస్టుగా ఉన్న నేను ట్రిపుల్ ఐటీలో అడుగుపెట్టా. రావడం రావడం "మై లెవెల్ ఈజ్ వేరు బ్రో" అన్న కటింగ్ ఇవ్వడం మొదలెట్టా. OMEGA-7 లో అతి క్రమశిక్షణ, ప్రతి ప్రశ్నకి నాకే ఆన్సర్ తెలుసు అన్నట్టు గబాల్న లేచి చెప్పడం. ఇది చూసి మా క్లాసులో సార్లు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ నన్నొక ఐన్ స్టైన్ అనుకోవడం. అలా ఒక 8 నెలలు గడిచాక, ఫస్టు సెమిస్టర్ పరీక్షలు పెట్టారు. 


నేనే ఫస్టు వస్తాను అనుకున్న నాకు ఆ సెమిస్టర్ రిజల్ట్స్ ఒక షాక్. లైఫ్లో ఫస్ట్ టైం నేను క్లాసు ఫస్టు రాలేదు. కాకపోతే మరీ జేసన్ టైపులో లాస్టు రాలేదు కానీ పదికి 8.5 వచ్చాయి. అందరూ ఇంతేనా ఇంతేనా అంటూ నవ్వులు. టీచర్లు కూడా ఏంటి ప్రవీణ్ ఇది అన్నట్టు చూపులు. ఆ మార్కుల దెబ్బతో సరిగ్గా నేల మీదకు వచ్చేశా. కరెక్ట్ గా సింక్ అయ్యింది ఆ సినిమా నాకు. 


సినిమాలో జేసన్ కి తక్కువ మార్కులు వచ్చాక తగిలిన మరో ఎదురుదెబ్బ, రవి పద్మనాభన్ అనే ఒక టీచర్. రవి పద్మనాభన్ అంటే వాళ్ళ క్లాసులో అందరికీ మహా గౌరవం, ఇష్టం. ఆయన ఏం చెప్తే వీళ్లంతా అదే చేస్తారు, ఒక్క జేసన్ తప్ప. జేసన్ కి ఎందుకో ఆ టీచర్ అంటే నచ్చదు. ఆయనంటే చిరాకు. జేసన్ వైఖరి అర్ధమైన రవి పద్మనాభన్, జేసన్ ని టార్గెట్ చేస్తాడు. అందరి ముందు నవ్వులపాలు చేస్తాడు. 


ఇది... ఇది కూడా నాకు బాగా సింక్ అయింది. అప్పట్లో మా కాలేజీలో కోటి సర్ అని ఒక కెమిస్ట్రీ టీచర్ ఉండేవారు. ఆయనకు ఒక సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉండేది. అదేంటంటే ఆయన టీచ్ చేసిన ప్రతీ క్లాసులో కనీసం 5 మందికి 90+ మార్కులు వస్తాయి అని. అంటే 50 మందిలో ఐదుగురికి. సెకండ్ సెమిస్టర్ కి మాకు కెమిస్ట్రీ చెప్పడానికి వచ్చారు కోటి సర్. అప్పటికే ఫస్ట్ సెమ్ మార్కుల దెబ్బతో కుదేలయి, సెకండ్ రో నుంచి చివర రో లకి వెళ్లిన నాకు, కోటి సర్ రాసిన అక్షరాలు కనపడేవి కాదు. అర్థమయ్యేవి కాదు. క్లాసులో మిగతా అందరికీ ఆయన పాఠం సూపర్ గా అనిపిస్తే, నాకు మాత్రం అదొక స్పానిష్ అనిపించేది.  


ఇక ఆయన క్లాసు వస్తే Vice city, EA Sports Cricket ఆడుకునే వాడిని. నన్ను కొన్ని రోజులు గమనించిన ఆయన మెల్లగా టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఓరోజు క్లాసులో లేపి, బోర్డు మీద చూపించి ఏదో ప్రశ్న అడిగారు. నాకు కనపడడం లేదని చెప్పా. దానికి ఆయన కోపం వచ్చి క్లాసు మొత్తాన్ని... "ఇది కనపడడం లేదా?" అని అడిగాడు. "కనపడుతుంది" అని చెప్పారు అందరూ. నీకు కనపడకపోతే ముందుకు వచ్చి కూర్చో అంటూ తిట్టారు. అలా కొన్ని రోజుల పాటు ఆ టార్గెటింగ్ జరిగింది. పరీక్షల కంటే ముందు, క్లాసులో 90+ రాబోయే విద్యార్థులు వీరే అంటూ ఆయన కొందరిని గుర్తించాడు. నన్ను మాత్రం, నువ్వు పాస్ అయితే చాలు అని పుల్లవిరుపుగా అన్నాడు. కట్ చేస్తే నాక్కూడా 90+ వచ్చింది అనుకోండి 😜 అది వేరే విషయం. అలా టీచర్ తో టార్గెటింగ్ విషయంలో కూడా సినిమా నాకు సింక్ అయింది. 


ఎండింగ్ డిఫరెంట్ గా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. ఒకసారి చూడొచ్చు ఆ సినిమా. 


అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. సినిమాలో హీరో, తన ఫ్రెండ్స్ తో కలిసి రోజూ వాళ్ళ స్కూల్ ముందున్న ఒక జ్యూస్ షాప్ కి వెళ్లి పుచ్చకాయ జ్యూస్ తాగుతూ ఉంటాడు. అందుకే ఈ సినిమాకి "Thanneer Mathan Dinangal" అనే పేరు పెట్టారు. Thanneer Mathan అంటే పుచ్చకాయ Dinangal అంటే రోజులు. సినిమా టైటిల్ అర్థం "పుచ్చకాయ రోజులు" 🤭 ఇది కూడా నాకు సింక్ అయింది. నా లైఫ్ కి కూడా నావి పుచ్చకాయ రోజులే, ఎందుకంటే క్లాసులో అందరి ముందు నేను వెర్రి పుచ్చకాయ అయిన రోజులు అవే కాబట్టి 😒 

మరి సభికులకు సెలవు. ఇంకో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం. 

ఇట్లు,

మీ వెర్రి పుచ్చకాయ 🍉

Eat me well to stay hydrated in summer. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం