ఉప్పూ కారం
ఓ చల్లటి ఆదివారం మధ్యాహ్నం 12 అవుతుండగానే, అప్పుడే పొయ్యి మీద ఉడుకుతున్న ఘుమ ఘుమలాడే చికెన్ మీద మూత తీసింది నలభై ఏళ్ల కమలమ్మ. నూనె తేలాడుతున్న ఎర్రటి చికెన్ పులుసును కలియతిప్పి, వస్తున్న కమ్మటి వాసనను పీల్చి "హ్మ్మ్ ఉడికేసింది" అంది.
హాస్టల్ నుంచి సెలవలకి ఇంటికి వచ్చిన కూతురు వాణికి త్వరగా అన్నం పెట్టేద్దామని స్టవ్ ఆపేసి, కూరను దించేసింది. కూతురు పీట మీద కూర్చోగానే, కంచంలో అన్నం పెట్టేసి, కూర వడ్డించేసి... "ఇంటికాడ అయినా బాగా తినవే తల్లి. ఆ హాస్టల్ తిండి తిని బక్కగా అయిపోయావ్" అంది.
చావడిలో బట్టలు ఉతుకుతున్న కమలమ్మ పెద్ద కూతురు కూడా వంత పాడుతూ "అవును బాగా సన్నపడిపోయిందిది. మూడు నెలల్లో మూడు వంతులు సన్నగా అయిపోయింది వాణి" అంది.
వేడి వేడి అన్నంలో కూర కలిపి ముద్ద నోట్లో పెట్టుకోగానే, "అబ్బా కారం" అంటూ గబ గబ నీళ్ళు తాగి అంగలార్చి కళ్ళు తుడుచుకోసాగింది. "కారమా..." అంటూ కొద్దిగా కూర చెయ్యి మీద వేసుకుని రుచి చూసింది కమలమ్మ. "బాగానే ఉంది కదే" అంటూ కూతురు వైపు ఆశ్చర్యంగా చూసింది.
"అయినా మీరు ఇంత కారం తినకూడదు అమ్మ" అంటూ కసురుకుంది కూతురు వాణి.
"ఇది కారం అంటావేంటే. ఈ మాత్రం కారం కూడా తినకపోతే బలం ఎలా వస్తది" అని చోద్యంగా చూసింది ఇద్దరు కూతుళ్ళ వైపు.
"ఇది తింటే బలం కాదు. బిపి షుగర్ వస్తాయి." అంటూ కొద్దిగా కూర మాత్రమే వేసుకుని చప్పగా కలుపుకుంటూ తినసాగింది.
"వారినీ, దీనికి మూడు నెలలు ఆ ఇంజనీరింగు కాలేజి హాస్టల్లో ఉండేసరికి మన రుచులు నచ్చట్లేదమ్మా" అంది పది వరకే చదివిన పెద్ద కూతురు.
"అది కాదు, నీకు నాన్నకి 40 ఏళ్లకే బిపి ఎలా వచ్చింది?" అని సూటిగా ప్రశ్నించింది వాణి.
"అంటే ఏంటే నువ్వు అనేది? నేను వండే ఈ కూరలు తినే మీ నాన్నకు నాకూ బిపిలు వచ్చాయంటావా?" తన 30 ఏళ్ల వంట ప్రస్థానాన్ని ప్రశ్నించేసరికి ఒకింత కోపం తెచ్చుకుంది కమలమ్మ.
ఇంకొంత కోపంగా "ఇలా తక్కువ తక్కువ తింటే రోగాలు రావొద్దు అంటే రాకుండా ఉంటాయా? ఎదురింటి మాధవరావు ఉన్నాడు. కొంచెం ఉప్పు తినండి, కొంచెమే కారం తినండి అంటూ జనానికి ఎక్కడపడితే అక్కడ ఊదరకొట్టేవాడు. వేలంత పీలగా అయిపోయాడు. ఇప్పుడు చూడు 40 దాటాయో లేదు మొన్ననే చనిపోయాడు. అందుకే పెట్టింది మూసుకుని తిను. అసలు ఈ వయసులో పిల్లలు ఎలా ఉండాలి? పిడుగుల్లా ఉండాలి. నువ్వూ ఉన్నావ్ పీనుగులా" అంటూ ఏకబిగిన పీకిన క్లాసుకు, కంచంలోనే చేతులు కడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది వాణి.
"మనం ఏమన్నామనే దీనికింత కోపం" అంటూ పెద్ద కూతురు వైపు చూసింది కమలమ్మ. "కాలేజీలో అలవాటు పడిందిగా మూడు నెలలు. రెండు రోజులు పోతే అదే అలవాటు అయిద్దిలే" ప్లేటు ఎత్తుతూ అంది పెద్ద కూతురు.
***
మూడు రోజులు డుమ్మా కొట్టాక, తాపీగా తర్వాత రోజు పొద్దున్నే వచ్చింది పని మనిషి లక్ష్మమ్మ
"రామ్మా లక్ష్మమ్మ, నీ పని బాగుంది. ఒక రోజు వస్తావు, 3 రోజులు సెలవు పెడతావు. నిన్న మా పెద్దమ్మాయి ఉతకాల్సి వచ్చింది బట్టలు మొత్తం"
"మా బంధువుల ఇంట్లో పేరంటం ఉంటే వెళ్ళానమ్మా అంతేనూ. మీరు మరీనూ" అంటూ వెంటనే విషయాన్ని మారుస్తూ "ఆ మాధవరావు గారి దినం భోజనానికి పిలిచారా అమ్మ మిమ్మల్ని?"
"ఆ పిలిచారు పిలిచారు. అవునే, అందరికీ అవి తినొద్దు ఇవి తినొద్దు అని చెప్తాడు కదా ఎలా చనిపోయాడు ఆయన? వాళ్లింట్లోనే పని చేస్తావు కదా నువ్వు"
"పాపం మంచి మనిషండి. గతంలో ఉప్పులూ కారాలు చూసుకోకుండా అన్నీ బాగా తిని గుండ్రాయిలా ఉండేవాడట. అలా తినడం వల్లే, ఇరవై ఏళ్ల క్రితం గుండె రోగం ఏదో వచ్చిందంట. ఇంకో పదేళ్లే బ్రతికేది అని చెప్పారట డాక్టర్లు."
"అవునా... నిజంగా అలా అవుతుందా ఏంటే? మరి మన తాతలు బాగా బండ పచ్చళ్ళు చేసుకుని మరీ తిని బతికారు" అని ఆశ్చర్యపోయింది చదువు తెలియని కమలమ్మ.
"అప్పటోళ్ళకంటే తిని తట్టుకునే శక్తి ఉండేది. ఇప్పుడు అలా తింటే పిట్టల్లా రాలిపోవడమే అమ్మ." అని చెప్పింది చదువు లేకపోయినా వైనం తెలిసిన లక్ష్మమ్మ.
"ఇక అప్పటి నుంచి ఆయన తినే విధానం మొత్తం మార్చేసి, తనలా ఇంకెవ్వరూ అవ్వకూడదని కనపడిన వాళ్ళకల్లా ఉప్పులూ కారాలు తక్కువ తినండి అంటూ చెప్పేవాడు. డాక్టర్లు పదేళ్లు అని చెప్తే ఇరవై ఏళ్లు బ్రతికాడు, ఇక మొన్ననే కాలం చేశాడు పాపం" అంటూ నిట్టూర్చింది లక్ష్మమ్మ.
ఎందుకో కమలమ్మ మనసు చివుక్కుమంది. అపరాధ భావంతో అక్కడే నిలబడి అంతా వింటున్న చిన్న కూతురు వాణి వైపు చూసి... "సర్లేవే... ఇక నుంచి ఉప్పూ కారాలు అన్నీ నువ్వు చెప్పినట్టే వేస్తా. సరేనా?" అంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి