నా బేసిక్ ఎలక్ట్రానిక్స్ కథ

ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మాకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సబ్జెక్టు ఉండేది. అందరూ అది ఈజీ సబ్జెక్ట్ అనుకుంటూ ఉంటే నాకు మాత్రం ఒక కొరకరాని కొయ్యలా ఉండేది. అసలు మా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఈ ECE సబ్జెక్టు ఎందుకు అని ప్రశ్నించాలని ఉండేది. కానీ ఏం చేయలేని పరిస్థితి. వాళ్లక్కూడా మా CSE సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి అనుకోండి. 

మామూలుగానే క్లాసులకు వెళ్ళడం పెద్దగా ఇష్టం లేని మనం, ఈ సబ్జెక్టు కి మాత్రం ప్రొఫెసర్ క్లాసులు వినకపోతే గట్టెక్కడం కష్టం అనిపించింది. అందుకే BE క్లాసు ఉన్నప్పుడల్లా క్లాసుకు వెళ్ళేవాడిని. అసలే విని నేర్చుకునే శక్తి తక్కువైన నాకు, ఆ క్లాసు కూడా ఇంగ్లీషు లో కాకుండా స్పానిష్ లో వినిపించేది. కారణం ET సబ్జెక్టు. ఈ ET బాగా వస్తేనే BE బాగా అర్థమవుతుంది. ముందు సంవత్సరం ET ఈజీగానే పాస్ అయ్యాను కానీ పెద్దగా కమాండ్ రాలేదు. అలా ముక్కు మీద పెట్టుకుని ఎగ్జాంలో తుమ్మేసాను, పాస్ అయ్యాను. కానీ ఇప్పుడు BE వదిలేలా కనిపించడం లేదు. ప్రొఫెసర్ క్లాసులో అర్ధమైన ఏదో కొంచెం నోట్స్ లో రాసుకునే వాడిని. 

పరీక్షకి వారం ఉంది అనగా, నాకు ఉన్న నాలెడ్జ్ ఎగ్జామ్ గట్టెక్కడానికి సరిపోదు అనిపించింది. ఇక వెంటనే ఉపేక్షించి లాభం లేదని, మా హాస్టల్లో ఒక ECE వాడి దగ్గర Mehta టెక్స్ట్ బుక్ తీసుకున్నా. ఇచ్చేటపుడు వాడు ఒక మాట చెప్పాడు, "భయ్యా... బుక్ నాకు 3 గంటల్లో ఇచ్చేయాలి. ఈ టైంలో చాలా మంది అడుగుతున్నారు బుక్, నేను కూడా చదవాలి అందుకే" అన్నాడు. సరే సరే అంటూ 3 గంటల్లో ఆ బుక్ చదివేసి నోట్ బుక్ లో మొత్తం నోట్ చేసుకున్నా. 

ఎంత బాగా రాసుకున్నా అంటే, అది చూడగానే పాయింట్స్ మొత్తం గుర్తు వస్తాయి. ఆ ఒక్క నోట్స్ చదువుకుంటే చాలు ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. ఇది చూసి నా క్లోజ్ ఫ్రెండ్, నా హాస్టల్ రూం మేట్ అయినా ఈసు గాడు "ప్రవీణ్ ఒకసారి బుక్ ఇస్తావా చదివి క్లాసు దగ్గర ఇస్తా" అన్నాడు. ఆనందంగా ఇచ్చా. 

ఏదో ఒక్కసారిగా ఈ కాలేజీలో నా అంత మేధావి లేదు అన్నట్టు ఫీలింగ్ లో ఉన్నా, నా నోట్స్ కి ఉన్న క్రేజ్ చూసి.

హ్యాపీగా ఆ గురువారం రోజు పొద్దున్నే మెస్లో ఊతప్పం తింటున్నా. నాతో వచ్చిన నా ఫ్రెండ్ తో ఏదో పిచ్చాపాటి చెప్తున్నా. ఇంతలో వచ్చిన ఈసు "ప్రవీణ్... బుక్ ఇదిగో. తరవాత తీసుకుంటా" అని వెళ్ళిపోయాడు. బుక్ పక్కనే పెట్టి ఊతప్పంని ఆస్వాదిస్తూ తిని, ఆ పిచ్చాపాటి కబుర్లలో అలా క్లాసుకు వెళ్ళిపోయా. 

ఆరోజు సాయంత్రం క్లాసులన్నీ అయ్యాక ఐదింటికి ఈసు వచ్చాడు "ప్రవీణ్ ఆ BE బుక్ ఇవ్వా" అన్నాడు. 

"అదేంటి ఈసు, నీకు పొద్దున్నే ఇచ్చా కదా" అన్నా

"ప్రవీణ్... నీకు మెస్లో ఇచ్చా కదా గుర్తులేదా" అన్నాడు. 

నాకు బల్బ్ వెలిగింది. అవును కదూ అంటూ నా పుస్తకాల్లో చూసాను, BE బుక్ కనపడలేదు. ఎందుకో గుండె కలుక్కుమంది. అసలే కష్టపడి రాసుకున్నా అంటూ మొత్తం వెతికా ఎక్కడా లేదు. క్లాసు దగ్గర మర్చిపోయానేమో అనుకుంటూ ఆఘమేఘాల మీద క్లాసు దగ్గరకు పది నిమిషాల్లో వెళ్ళా. ఎక్కడా కనపడలేదు. 

నా బుర్రకి బుక్ ఎక్కడ పోయిందో అంతు చిక్కలేదు. వెంటనే పొరపాటున మెస్సులో మర్చిపోయానేమో అన్న అనుమానం వచ్చింది. అనుమానం ఏం కర్మ నిజమే అయ్యి ఉంటుంది, ఎందుకంటే అప్పటికే బోల్డన్ని సార్లు నేను మెస్సులో బుక్ మర్చిపోవడం, ఆ మెస్సు వాళ్ళు ఆ బుక్ పక్కన పెట్టి ఉంచడం. సాయంత్రం నేను తీస్కొడం పరిపాటి అయిపోయింది. 

సర్లే మెస్సులో తీస్కుందామ్ అంటూ నిదానంగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చా. మెస్సులో నాలా పుస్తకాలు మర్చిపోయిన వాళ్ళందరి పుస్తకాలు పక్కన పెట్టి ఉంచారు. వాటిలో వెతికా నా పుస్తకం కనపడలేదు. గుండె వేగంగా కొట్టుకోసాగింది. 

వెళ్ళి అక్కడ మెస్సులో ఉన్న ఒకాయన్ని అడిగాను. తెలీదు ఉంటే అక్కడే ఉండాలి అన్నాడు. మెస్సు మొత్తం పరిగెత్తి చూసా ఎక్కడా లేదు. చివరకి ఏదో ఒక మూల కనపడింది. ఆనందంగా వెళ్ళి తీసా. దాంట్లో పుస్తకం అట్ట తప్ప లోపల పేపర్లు లేవు. పక్కనే కుర్చీలో కూర్చుండిపోయా నేను. తల దిమ్మెక్కింది. BE సబ్జెక్ట్ మీద నా ఆశలన్నీ ఆ బుక్కే.

అప్పటికి సాయంత్రం ఆరయింది. వెళ్ళి మెస్సు ఓనర్ బయట కూర్చుంటే అడిగాను. ఏమో తెలీదమ్మ అన్నాడు. కరెక్టే. మెస్సులో బుక్ మర్చిపోవడం నాదే తప్పు అనుకుంటూ... ఆకలి వేస్తుంటే పక్కనే గురువారం స్నాక్స్ గా గుగ్గిళ్లు ఇస్తుంటే అవి తీసుకున్నా. 

తింటూ స్నాక్స్ పెట్టిన పేపర్ చూసా, నా హేండ్ రైటింగ్ ఉంది దాని మీద. వెంటనే నాకు అర్థమయింది. పక్కనే స్నాక్స్ పడేసిన డస్ట్ బిన్ చూసా మొత్తం నా పుస్తకంలోని పేపర్లే. కన్నీళ్లు పొంగుకుని వచ్చేశాయి. ఇంక గుగ్గీళ్లు నోట్లోకి వెళ్ళలేదు. అవి పక్కన పడేసి మసకబారిన కళ్ళతో హాస్టల్ రూంకి వచ్చేసాను. ఆరోజంతా ఎవ్వరితోనూ మాట్లాడలేదు. 

BE ఎగ్జామ్ ఇక పోయినట్టే అని ఫిక్స్ అయ్యా. ఎగ్జామ్ రాయకపోయిన ఒకటే, అనుకుని కూడా అని అయిష్టంగా ఎగ్జామ్ కి వెళ్ళా. అప్పుడు నా పక్కన పడ్డాడు ECE "సాల్మన్ రాజు సప్పా". అప్పటి దాకా అస్సలు పరిచయం లేని తనని, ఈరోజు "సాల్మన్ గాడు" అని పిలుస్తున్నా అంటే అది వాడి మంచితనం. పోయినట్టే అనుకున్న ఆ ఎగ్జామ్ B గ్రేడ్ తో పాస్ అయ్యా అంటే అది మా సాల్మన్ గాడి చలవే. తర్వాత మేమిద్దరం ఇన్ఫోసిస్ మైసూరులో హైదరాబాద్లో కలిసి చాలా కాలం ఉన్నాం. ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పా... వాడికి అస్సలు ఇష్టం లేకపోయినా... మళ్ళీ చెప్తున్నా "థాంక్స్ రా సాల్మన్". 

అదన్నమాట వ్యథ అయిన నా BE గాథ. 🙂

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం