నేను ప్రేమించిన అమ్మాయి ఫోన్ నంబర్
ఈరోజుల్లో అంటే ప్రేమలు అన్నీ ఇన్ స్టా గ్రాముల్లో, స్నాప్ చాట్స్ లో మొదలవుతున్నాయి. 2010లో ఫేస్ బుక్ ఫేస్ కూడా సరిగ్గా రూపు దిద్దుకోని సమయం అది. గట్టిగా మాట్లాడితే, ఫేస్ బుక్ లో పక్క వాళ్ళ ఛాట్స్ కూడా క్రోమ్ console లో ఏదో కోడ్ రన్ చేస్తే వచ్చేసేది. ఆ సమయంలో ఒక అమ్మాయితో మాట్లాడాలి అంటే కచ్ఛితంగా sms లేదా కాల్ ఒక్కటే మార్గం.
కాలేజీలో అస్సలు ప్రేమించకూడదు అనుకున్న నేను కూడా ప్రేమలో పడ్డాను. అలా ఇలా కాదు పీకల్లోతు ప్రేమలో పడ్డాను. అన్నీ కథల్లాగే నా కథ కూడా వన్ సైడ్ లవ్వుతోనే మొదలయ్యింది. రోజు మెస్ దగ్గర వెయిట్ చేయడం. తర్వాత క్లాసు వరకు ఫ్లాలో అవ్వడం. ఇలా దాదాపు రెండు సంవత్సరాల పాటు చేశాను అంటే, తప్పు నాది కాదు పూరీ జగన్నాథ్ ది.
పోకిరిలో "దేవ దేవ దేవుడా"
దేశముదురు లో "నిన్నే నిన్నే"
అనే టీజింగ్ ఫాలోయింగ్ పాటలు పెట్టీ, అప్పుడే టీనేజ్ లో ఉన్న నన్ను పూర్తిగా చెడగొట్టేసాడు. అవి చూసి కమెడియన్ కి ఎక్కువ, కోట శ్రీనివాసరావుకి తక్కువలా ఉండే మనం, హీరో లెవల్లో ఫీల్ అయ్యి ఫాల్లో చేసేయడం.
ఇలా ఫాలోయింగ్ చేసే సమయంలో ఎవరో వచ్చి, తనకి బాగాలేక ఇంటికి వెళ్ళిందట అని చెప్పారు. అప్పుడు వెంటనే నాకో తుంటరి ఐడియా వచ్చింది. వెంటనే మా క్లాసు అందగాడు, ఆంగ్ల భాషా ప్రవీణుడు అయినా నౌషద్ ని పిలిచాను. మా కాలేజీలో ఉన్న అందరి డిటైల్స్ ఫోన్ నంబర్స్ తో సహా ఉండే PDF ఒకటి నా దగ్గర ఉండేది.
దాంట్లో నేను ప్రేమించిన అమ్మాయి నంబర్ చూసి, దానికి ఫోన్ చేద్దాం అన్నాను. అది వాళ్ళ నాన్న నంబర్ ఏమో అన్నాడు నౌషద్. అయితే అవ్వనీ రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేద్దాం. పొరపాటున 1% ఛాన్స్ తో ఫోన్ తన దగ్గర ఉంటే, తన గొంతు వినొచ్చు కదా అన్నాను.
నా పెంకితనం, కక్కుర్తి బాగా తెలిసిన నౌషద్, సరే అంటూ నా మోటో జీ ఫోన్ నుంచి కాల్ చేసాడు. చాలా రింగుల తర్వాత ఇంక కాల్ కట్ అవ్వబోతోంది అన్నప్పుడు, ఎవరో ఆడమనిషి హలో అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. మగ గొంతు expect చేసిన మేము, ఆ లేడి వాయస్ వచ్చేసరికి కంగారు పడి కట్ చేశాం.
ఆ గొంతు వాళ్ళమ్మ గారిదా అనుకోవడానికి, అంత ఏజ్ లా కూడా లేదు. ఎవరో చిన్న పిల్లలది అనుకోవడానికి అలా కూడా లేదు. తన గొంతేనేమో అన్నాడు నౌషద్. అవునేమో అనుకుంటూ ఆ నంబర్ ని "కిషోర్" అంటూ సేవ్ చేసుకున్నా.
ఎందుకంటే మా అమ్మ జేమ్స్ బాండ్ నంబర్ 008. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా పొరపాటున ఫిమేల్ కాంటాక్ట్ నేమ్స్ ఉంటే చాలు ఏమిటిది అని అడిగేస్తుంది. అందుకే ఈ కిషోర్ పేరు.
ఆ నంబర్ సేవ్ చేశా. ఈ లోపే ఇంకో కాల్ వచ్చింది, ఏదో కొత్త నంబర్ ఇది. చాలా మామూలుగా హలో అంటూ లిఫ్ట్ చేశాను నేను.
"ఎవరండీ ఇందాక మా నంబర్ కి ఫోన్ చేసింది" అని గట్టిగా అడింగింది అవతలి ఆడగొంతు. దెబ్బకు గతుక్కుమన్నా. "ఈ నంబర్ కి మేము కాల్ చేయలేదండి" అంటూ తెలివిగా భయంలోనే దబాయించా నేను. "ఈ నెంబర్ కాదు, ఇంకో నంబర్ అంటూ మేము ఇందాక కాల్ చేసిన నంబర్ చెప్పింది"
"అయ్యో సారీ అండి. రాంగ్ నంబర్ అండి. ఇంకెప్పుడు ఫోన్ చేయమండి. నమ్మండి. పాహిమాం. పాహిమాం" అంటూ కాళ్ళు పట్టుకున్నంత పని చేసి ఫోన్ పెట్టేసా.
వామ్మో. ఈవిడ కచ్ఛితంగా తను అయితే కాదు. ఎవరో బంధువుల ఆవిడ అనుకుంటూ ఆ కొత్త నంబర్ ని "ఖాసిం" అని సేవ్ చేసుకున్నా. ఆ కిషోర్, ఈ ఖాసిం రెండూ మా స్కూల్ మేట్స్ పేర్లు. ఇక ఆ రెండు నంబర్లకి చచ్చినా ఫోన్ చేయలేదు నేను.
తర్వాత నుంచి ప్రతి రోజూ యథావిధిగా మెస్సు దగ్గర నుంచి ఫాలోయింగు. నాతో పాటు రాలేక పాపం నా ఫ్రెండ్స్ ఎంత మదనపడేవాళ్లో. తను హాస్టల్ కి ఫోన్ తెచ్చింది అని తెలిసాక, ఇక ఆ నంబర్ కనుక్కోడానికి నేను చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు లేవు. నాకున్న లూస్ టంగ్ వల్ల, నన్ను ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అందుకే ఫోన్ నెంబర్ తెలిసినా ఎవ్వరూ ఇచ్చేవాళ్ళు కాదు.
ఇలా ఒక సంవత్సరం సాగిన తర్వాత, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి.
అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాసయ్యా అన్న విజయ గర్వంతో ఉన్న నేను హాస్టల్ కారిడార్లో క్రికెట్ ఆడుతున్నా. మా అమ్మేమో పొద్దున నుంచి ఒకటే ఫోన్లు. ఎందుకంటే మా ఊర్లో ప్రతి జూలై 16 కి జరిగే కొండ మీద పండక్కి రమ్మని. నేనేమో కాలేజీలోనే ఉండి క్రికెట్ ఆడుకుందాం అని, ఆ ఫోన్లు కట్ చేసి మరీ క్రికెట్ ఆడుతున్నా.
సాయంత్రం 4 అయింది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. ఇంతలో వర్షం కూడా మొదలయింది. కారిడార్ లో ఒక వంతు తడిచింది ఆ వర్షంతో. అసలే వరెస్ట్ ఫీల్డర్ అయిన నేను, ఆడుతున్న ఆ మాచ్లో రెండు బౌండరీలు వదిలేసా. ఇంకో షాట్ మా క్రాంతి గాడు సచిన్ టెండూల్కర్ లా స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టాడు.
ఇది కూడా బౌండరీ వెళ్తే కష్టం అని పరుగు పరుగున వెళ్ళి ఆపబోయాను. ఆ తడిచిన టైల్స్ మీద జర్రున జారి పడ్డాను. ఒకేసారి తల వెళ్ళి టైల్స్ కి తగిలింది. లైట్ గా unconscious అయ్యాను.. ఇంతలో మా సూరిగాడు, శ్రీను మాయ్య, క్రాంతి గాడు పరుగు పరుగున వచ్చారు.
"తల దగ్గర బ్లడ్ క్లాట్ అవ్వకూడదు, రుద్దండి" అంటున్నా నేను ఆ మైకంలో. అప్పటికే సుమారు 65 కేజీలు ఉన్న నన్ను అందరూ కలిసి మోసుకెళ్ళి మంచం మీద పడుకోపెట్టారు. సూరిగాడు, క్రాంతి నా తలని గట్టిగా రుద్దుతూ ఉన్నారు. శ్రీను మాయ్య నా కాళ్ళు చల్లగా అవ్వకూడదని రుద్దుతూ ఉన్నాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం, ఆరోజు అలా వాళ్ళు చేసినదానికి. మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎప్పటికీ మంచి జరగాలని కోరుకోవడం కంటే.
అలా దాదాపుగా 20 నిమిషాలు చేశాక నాకు పూర్తిగా మెలకువ వచ్చింది. అంతా మామూలుగానే ఉన్నట్టు ఉంది కానీ ఎక్కడో మైండ్ అంతా డల్ గా ఉంది. మా నాన్నకి ఫోన్ చేశాను. మంచం మీద నుంచి పడ్డాను అని అబద్ధం చెప్పి, గుంటూరు హాస్పటల్ కి వెళ్ళాం. తలకి CT scan తీయించాం. హెడ్ లో ఫ్లూయిడ్స్ మూవ్ అయ్యాయి అండి. ఎక్కువ తల కదపకూడదు. రెస్ట్ తీస్కొండి అని చెప్పి పంపారు.
పండక్కి రమ్మంటే ఇంటికి రాని నేను. ఈ దెబ్బతో ఒక రోజు ముందే ఇంటికి వెళ్ళే సరికి మా అమ్మ "నేను చెప్పానా రమ్మని. నువ్వు రానందుకే ఆ తల్లి అలా నిన్ను రప్పించుకుంది" అంది.
ఏం చేస్తాం దరిద్రం అలా కలిసి వచ్చింది. అనుకుంటూ July 15, 2011 న సాయంత్రం ఐదింటికి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ "కొండ మీద పండుగ శుభాకాంక్షలు" అని మెసేజ్లు పంపడం మొదలెట్టా. ఆరోజుల్లో రోజుకి 100 sms లు ఐడియా వాడు ఫ్రీ ఇచ్చేవాడులేండి.
కాసేపటికి మా స్కూల్ మేట్ ఖాసిం గాడు "who r u" అని నా మెసేజ్ కి రిప్లై పెట్టాడు. మా ఖాసిం గాడు నన్ను మర్చిపోయినట్లున్నాడు అనుకుని "I'm NIRMAL PRAVEEN LINGISETTY" అంటూ క్యాపిటల్ లెటర్స్ లో రిప్లై పంపా. ఇంక తిరిగి రిప్లై రాలేదు.
తర్వాత రాత్రికి ఎవరో నాకు ఫోన్ చేశారు. నువ్వు ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టావా అని. "ఛ ఛ నేనెందుకు పెడతాను. నా దగ్గర తన నంబర్ ఉంటే కదా." అనుకుంటూ ఒక్కసారిగా నాలుక్కరుచుకున్నా. అప్పుడు గుర్తొచ్చింది. నేను ఎప్పుడో సేవ్ చేసుకున్నా ఖాసిం నంబరే తనది అని.
ఒక సంవత్సరం క్రితం వాళ్ళ అక్క దగ్గర ఉన్న ఫోన్ తను తీస్కుని వాడటం మొదలెట్టిందట. మనకు తెలీదు అది. ఇప్పుడు ఏదో రాండమ్ గా అందరికీ మెసేజ్లు పెడుతుంటే అలా నా లక్కు కలిసింది. ఎవరెవర్నో కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమలాడుకున్నా దొరకని నంబర్, ఏదో మ్యాజిక్ లా నా ఫోన్లోనే ఉంది.
అప్పుడు అనిపించింది...
"ఈ కొండ మీద పండగ నిజంగానే నా జీవితంలో పండగ తెచ్చింది" అని. అప్పుడు మొదలైన మా ఛాటింగ్ తర్వాత కాల్స్ నుంచి చివరకు పెళ్లి దాకా వచ్చింది అంటే అది ఆ కొండ మీద ఉన్న ఆ తల్లి దయవల్లే అనుకుంటా నేను.
ఇంతకీ నా శ్రీమతి, అప్పుడు నేను విసిగిస్తూ పెట్టిన మెసేజులకు పెట్టిన తొలి రిప్లై ఏంటో తెలుసా...
"Hello... what's ur pblm?"
దాదాపు పదేళ్లకు, ఇప్పటికి అయినా అర్థమయిందనుకుంటా తనకి నా ప్రాబ్లెమ్. 😝😝
Superb Praveen.. baagundi Nee atma katha series
రిప్లయితొలగించండిThank you Naiduu 😍🥰🤩
తొలగించండి