నేను అడక్కుండానే ఎవరో చెప్పిన నా జాతకం
నా చిన్నప్పుడు అన్నీ సెలవలకి మేము మా ఊరు ఫిరంగిపురం నుంచి అనంతపురం వెళ్ళే వాళ్లం. ఎందుకంటే మా అమ్మ పుట్టి పెరిగింది అనంతపురంలో. నేను పుట్టింది కూడా అక్కడే. (Me feeling proud as రాయలసీమ బిడ్డ 😝). మా నాన్న నేటివ్ ప్లేస్ గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం. నేను పెరిగింది అక్కడ. ప్రతి సెలవలకి మా అమ్మ పోరు తట్టుకోలేక మా నాన్న మమ్మల్ని అనంతపురం తీస్కెళ్లేవాడు. గుంటూరు నుంచి అనంతపురం అంటే దగ్గర దగ్గర 500 కిలోమీటర్లు. బస్సులో వెళ్తే కష్టం అని ట్రైన్లో వెళ్ళేవాళ్ళం.
చిన్నప్పుడు బస్సు అంటే అస్సలు పడని నాకు, ఆ ట్రైన్ జర్నీ తెగనచ్చేసేది. దగ్గర దగ్గర 12 గంటల ప్రయాణం. రాత్రి కూడా జర్నీ ఉండేది. ప్రయాణంలో తినడానికి ఫుడ్ కట్టుకుని... కోలాహలంగా ఓ పండుగలా వెళ్ళి వచ్చేవాళ్ళం. ప్రయాణంలో నేను ఏ బుజ్జాయో, బాలమిత్ర బుక్కో కొనుక్కుని కిటికీ పక్కన కూర్చొని చదువుకుంటూ ఉంటే... మా నాన్న మాత్రం పక్కన ఎవరైనా సహ ప్రయాణికులు ఉంటే వాళ్ళతో ముచ్చట్లు మొదలెట్టేవాడు. వాళ్ళకి ఒక్క బ్యాంకు డిటైల్స్ తప్ప అన్నీ చెప్పేవాడు. 🤭
అలా ఒక తిరుగు ప్రయాణంలో ట్రైన్లో మా నాన్నకు సీటు పక్కన ఒక ముసలాయన తగిలాడు. రిటైర్డ్ ఇంజనీరుని అని చెప్పుకున్నాడు. జుట్టంతా నెరిసిపోయి రబ్బరు చెప్పులు వేసుకుని ఉన్నాడు. మా నాన్నతో కబుర్లు మొదలెట్టాడు.
రాత్రి వరకు బాగానే కబుర్లు చెప్పుకున్నాక,మేము తినడానికి తెచ్చుకున్న ప్యాకెట్లు ఓపెన్ చేశాము. ఆయన మాత్రం ఏమీ తినడానికి తెచ్చుకున్నట్టు లేడు. మా నాన్న "తింటారా" అని అడిగితే సరే అని తీసుకున్నాడు. చాలా ఆకలి మీద ఉన్నట్టు గబ గబ తినేశాడు.
తింటూ ఆయన ఒక మాట చెప్పాడు "నా కొడుకులు నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. ఈరోజు నాకు తినడానికి అన్నం లేదంటే కారణం వాళ్ళే. నువ్వు నేను ఎవరో తెలీకపోయినా అన్నం పెట్టావు" అన్నాడు. ఆయనకు నీళ్ళు కూడా ఇచ్చి... మేము తిన్న ప్లేట్లు కడగటానికి మా అమ్మ నాన్న ఇద్దరు రైలు భోగీ చివరకు వెళ్ళారు. నేను ఒక్కడినే అక్కడ కూర్చుని ఉన్నా. అప్పుడు నా వయసు ఒక 12-13 ఏళ్లు ఉంటుందేమో.
నన్ను దగ్గరకు పిలిచాడు ఆ ముసలాయన. నేను వెళ్తే... "నాకు జ్యోతిష్యం తెలుసు. నీక్కూడా చెప్పమంటావా" అన్నాడు. "ఏం అవసరం లేదు" అన్నా. "పర్లేదు ఒకసారి చూస్తాను చెయ్యి ఇవ్వు" అన్నాడు. చెయ్యిచ్చా.
చెయ్యి దీర్ఘంగా చూసి, "నువ్వు బాగా చదువుతావా?" అన్నాడు. "అవును నేనే మా స్కూల్ ఫస్టు" అన్నా గర్వంగా. "నువ్వు పెద్ద చదువులు చదువుతావు." అన్నాడు. నాకు అప్పటికి M.Tech అంటే ఇష్టం. "M. Tech చదువుతానా?" అన్నాను. "అది ఖచ్చితంగా తెలీదు కానీ పెద్ద చదువు అయితే బాగా చదువుతావు" అన్నాడు.
తర్వాత కాసేపు నా చెయ్యి నా మొఖాన్ని తిప్పి తిప్పి చూసి "నీకు వివాహం త్వరగా అవుతుంది. లవ్ మ్యారేజ్ అవుతుంది" అన్నాడు. నేను అప్పటికి షాక్ అయ్యా. ఎందుకంటే నా రంగు, నా బరువు అలా ఉండేవి. అదుర్స్ లో ఎన్టీఆర్ బ్రహ్మానందాన్ని అడిగినట్టు "అంటే నాక్కూడా అమ్మాయిలు పడతారా గురువుగారు" అని అనుకునేలాంటి షాక్ కి గురయ్యా.
తర్వాత "నీకిప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నాయా?" అన్నాడు. అప్పటికి నాకు ఎప్పుడూ జలుబు చేస్తూ, ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టు తిరిగేవాడిని. "అవును" అని తల ఊపా. "ఏం పర్లేదు. నువ్వు నీ మనవళ్లని చూస్తావు" అన్నాడు. మా కుటుంబంలో అప్పటికి అందరూ కనీసం 80 ఏళ్లు బ్రతికిన వాళ్ళే కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు.
ఈలోపే మా అమ్మ నాన్న వచ్చారు. ఆయన నా చెయ్యి పట్టుకొని ఉండడం చూశారు. "ఏంటండి పిల్లాడి చెయ్యి పట్టుకున్నారు?" అన్నాడు మా నాన్న. "నాకు palmistry తెలుసు. అదే చూస్తున్నా" అన్నాడు.
మా నాన్నకి కోపం వచ్చింది "అసలు మేము లేనప్పుడు పిల్లాడి చెయ్యి ఎందుకు చూశారు. చూడొచ్చా అలా" అన్నాడు. "మామూలుగా చూసాను" అన్నాడు ఆయన. వెంటనే నన్ను ఆయన దగ్గర నుంచి దూరంగా, వాళ్ళ పక్కకి తీస్కెళ్లారు ఆ అమ్మ వాళ్ళు. రాత్రి కూడా ఆయనకి దూరంగా ఉన్న బెర్త్ లో పడుకోబెట్టారు. మేము పొద్దున్న 3 గంటలకి మా ఊరులో దిగిపోయాం.
తర్వాతి రోజు మా నాన్న ఆ ముసలాయన గురించి ఇలా చెప్పడం మొదలెట్టాడు. "నేను చాలా మందితో మాట్లాడా కానీ, ఆ ముసలాయన చాలా డిఫెరెంట్ గా ఉన్నాడు. రిటైర్డ్ ఇంజనీర్ అన్నాడు, కానీ మాసిన బట్టలు, రబ్బరు చెప్పులు వేసుకున్నాడు. తినడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు అంటేనే ఏదో తేడాగా అనిపించింది. ఆయన సంచిలో కూడా ఏవో పుస్తకాలు అవి ఉన్నాయి. ఆయన విజయవాడలో దిగాలి అన్నాడు. విజయవాడకి వెళ్ళేసరికి పొద్దున్న 5 అవుతుంది. కానీ రాత్రి మనం 3 గంటలకి దిగేటప్పటికే ఆయన కానీ, ఆయన సంచి కానీ ఆ బెర్త్ దగ్గర లేవు. ఏదో డిఫెరెంట్ గా ఉన్నాడు ఆయన. అందుకే రాత్రి నిన్ను ఆయన దగ్గర నుంచి తెచ్చేసాం" అన్నాడు.
"ఇంకెప్పుడు ఎవరు చేతులు చూపించమన్నా చూపించోద్దు." అని చెప్పాడు. అప్పటి నుంచి ఇంకెవరు జ్యోతిష్యం చెప్తాం అన్నా కూడా నేనెప్పుడూ చెయ్యి చూపించలేదు.
ఒక్క నిమిషం నా చెయ్యి చూసి ఆయన చెప్పిన వాటిల్లో 2 విషయాలు నిజమయ్యాయి. కానీ ఆ మూడవది కూడా నిజమైతే ఇంకా బాగుంటుంది. 😉
అదండీ నేను అడక్కుండానే ముక్కూ మొహం తెలియని వ్యక్తి చెప్పిన నా జాతకం కథ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి