నా సన్ కథ

అది 2004-05 సమయం. 

నేను నా ఏడో తరగతిలో అప్రతిహతంగా చదువుతున్న రోజులు. యూనిట్ టెస్టుల్లో 150 కి 147లు వస్తున్న రోజులు. మా మండలంలో Essay writing పెట్టినా Debates పెట్టినా Quiz competitions పెట్టినా అన్నీ మనమే ఫస్టు. భాష్యం టాలెంట్ టెస్టులో స్టేట్ 4th ర్యాంక్. ఆక్స్ ఫర్డ్ టాలెంట్ టెస్టులో స్టేట్ 6th ర్యాంక్. ఇలా ఎక్కడ ఎగ్జామ్ రాస్తే అక్కడ అన్నీ అవార్డులూ, రివార్డులు మనవే.  ఆ టైంలో నిర్మల్ ప్రవీణ్ అంటే మా స్కూల్ మొత్తానికి ఫేమస్. 

నాకు అంతలా పేరు వచ్చినా, అవార్డులు వచ్చినా దాని వెనకాల మా నాన్న కృషి ఎంతో ఉంది. ప్రతి ఎండాకాలంలో ఆ తర్వాతి సంవత్సరంలో ఉన్న సిలబస్ మొత్తం చదివించేవాడు. ప్రతి ఒక్క ప్రశ్న, ప్రతి ఒక్క లెక్క ఆయనే పక్కన కూర్చుని చేయించేవాడు. తప్పు చేస్తే మాత్రం పుచ్చ పగలకొట్టే వాడు. మిగతా విషయాల దగ్గర ఎలా ఉన్నా కూడా చదువు దగ్గర మాత్రం మా నాన్న విపరీతమైన స్ట్రిక్ట్. కోపం వచ్చింది అంటే బెల్టు దెబ్బలు పడాల్సిందే. 

అలా ఎన్నో దెబ్బలు తిన్న నేను, ఏడవ తరగతి లో కొంచెం టెంక ముదిరేసరికి "నువ్వు నాకు చదువు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నేను చదువుకుంటా" అన్నా. దానికి మా నాన్న బాగా దీర్ఘంగా ఆలోచించి "సరే, ఏడవ తరగతి లో మండలం ఫస్టు తెచ్చుకో. తర్వాత ఇక నీకు నువ్వే చదువుకో " అన్నాడు. యాహూ అనుకున్నా. బాగా చదివా. పబ్లిక్ ఎగ్జామ్స్ రాశా. మా బ్యాచ్ తోనే రాష్ట్రంలో ఏడవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టడం లాస్ట్. 580 వస్తాయి అనుకున్న నాకు 563 (అనుకుంటా) వచ్చాయి. హిందీ మరీ దరిద్రంగా 82 వచ్చాయి. అది దెబ్బేసింది. ఏదైతేనేం ఆ 563 కూడా మండలం ఫస్టే.

దాంతో ఇక మా నాన్న 8 వ తరగతి నుంచి నా చదువు దగ్గరకు రావడం మానేశాడు. నేను ఇక స్టార్ లా ఫీలవ్వడం మొదలెట్టా. చదువుని బ్యాక్ సీట్లో పెట్టీ, ఎంజాయిమెంట్ ఫ్రంట్ సీట్లోకి తెచ్చా. మార్కులు మెల్లగా తగ్గిపోయాయి. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు కానీ, ఏం మాట్లాడలేదు మా నాన్న. 

అప్పట్లో మా స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్టు ఇంటికి తీస్కెల్లే పద్దతి ఉండేది కాదు. లేకపోతేనేం స్కూల్లో ఉండే టీచర్లు అందరూ మా నాన్న ఫ్రెండ్సే. ఒకరోజు మా ఇంగ్లీష్ టీచర్, మీ అబ్బాయికి "ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు" అని చెప్పాడంట. వచ్చి అడిగాడు మా నాన్న. "ఛ ఛ అదేం లేదు. ఇంగ్లీషులో నేను తోపు. దమ్ముంటే ఆపు" అన్న రేంజులో చెప్పా. 

సరే అని. "సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు" ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పు అన్నాడు. 

తూర్పు అంటే East, ఉదయిస్తాడు అంటే raises మరి సూర్యుడు అంటే.. గుర్తు రాలేదు. సూర్యుడు అంటే సూర్య భగవానుడు... చంద్రుడు అంటే Moon. సూర్యుడికి తెలుగు నానార్థాలు గుర్తొస్తున్నాయి కాని, ఇంగ్లీష్ పదం గుర్తు రావట్లేదు. సూర్యుడ్ని ఏమంటారో నాలో నేను తెగ ఆలోచించా, అస్సలు గుర్తుకు రాలేదు.

"మా క్లాసులో ఇది ఎప్పుడు చెప్పలేదు" అన్నా. అప్పుడు నేను చదువుతుంది 8 వ తరగతి. మా నాన్న ఫడేల్ మని తంతే బెడ్ మీద కూర్చున్న నేను దొర్లి కింద పడ్డా. 

"నాకు నిజంగా గుర్తు రావట్లేదు నాన్న. సూర్యుడు అన్న పదం కాంప్లెక్స్ అనుకుంటా. దాని మీనింగ్ నాకు తెలీదు" అన్నా ఏడుస్తూ. ఇంకో రెండు దెబ్బలు కొట్టి. 

"సన్ అంటే ఇంగ్లీషులో ఏంటి" అన్నాడు.

"సన్ అంటే కొడుకు" అంటూ ఏడుస్తూ చెప్పా. నవ్వాలో ఏడ్వాలో తెలీని మొహం పెట్టీ, మా నాన్న "ఛీ" అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 

వంట దగ్గర నిలబడ్డ మా అమ్మ "చాల ఈజీ అది. బాగా ఆలోచించి చెప్పు" అంది. "నాకు తెలీదు. నేనెప్పుడూ చదవలేదు" అని చెప్పా. 

"చదవేస్తే ఉన్న మతి పోయిందంట" అంటూ మా అమ్మ తిట్టుకుంటూ వంట పని చూస్కుంటూ కూర్చుంది. ఇంతలో మా నాన్న మళ్ళీ వచ్చాడు 

"S-U-N సన్ అంటే ఏంటి" అన్నాడు. 

అప్పుడు వెలిగింది నా బల్బ్. నిజమే అదే సూర్యుడు. అంత చిన్నది గుర్తు రాక ఇన్ని తన్నులు తిన్నా. తల పట్టుకుని కూర్చున్నా. 

అప్పుడు మా నాన్న వచ్చి నన్ను దగ్గరకు తీసుకున్నాడు. చదువు దగ్గర కొట్టడం, మిగతా విషయాల్లో చాలా ప్రేమగా ఉండడం మా నాన్నకి అలవాటు. అలాంటి నాన్న తర్వాత నా చదువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను బిటెక్ కి వచ్చినా కనీసం మార్కులు కూడా అడగలేదు. 

ఇప్పుడు నేను ఒక మంచి పరిస్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం మా నాన్న. ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన, డబల్ మాస్టర్ డిగ్రీలు చేశాడు. గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. ఆయన వయసు 40 వచ్చేదాకా చదువుతూనే ఉన్నాడు. ఈరోజు గుంటూరు జిల్లాలో నెంబర్ వన్ ఫిజికల్ డైరెక్టర్ మా నాన్న. ఆయన చిన్నప్పుడు నా చదువులో వేసిన ఫౌండేషన్ వల్లే ఈ స్థాయికి అయినా రాగలిగాను. లేకపోతే నాకున్న తోక వంకరకి కచ్ఛితంగా పుట్ పాత్ మీదే ఉండేవాడిని. థాంక్యూ నాన్న. 🙂

నాకు పెళ్లయి 2 సంవత్సరాలు అవుతోంది, బంధువులు అందరూ... పిల్లలెప్పుడు? అంటూ ఉన్నారు. చూద్దాం అంటూ మాట దాటేస్తున్నా కానీ, నాకు మనసులో పిల్లలంటే సుతరామూ ఇష్టం లేదు. మనకున్న అనారోగ్యాలకు నెక్స్ట్ జనరేషన్ ని కూడా కని, వాళ్ళకి ఇంకా ఎన్నో అనారోగ్యాలు పంపకం ఎందుకు చేయాలి అనిపిస్తుంది. 

నన్ను ఎన్నో కష్టాలు పడి, పెంచి పెద్ద చేసిన నా తల్లిని ఒక డాటర్ లా, నా తండ్రిని ఒక సన్ లా చూసుకుంటే చాలదా అనిపిస్తుంది. ఏమంటారు??

అది.. నా సన్ aka మా నాన్న కథ. 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

చాదస్తం

ఉప్పూ కారం