ఆడాలంటే ఓడాలి

జీవితంలో మనం ఆడే ప్రతీ ఆట గెలవాలనే ఆడతాం. ఎందుకంటే ఓటమిని మనం తట్టుకోలేం. గెలిస్తేనే నిలబడతాం అని అనుకుంటాం. కానీ ఓడిపోవడానికే మనం ఆడాల్సి వస్తే...

అది 2012-13 సమయం. మా కాలేజీలో కౌంటర్ స్ట్రైక్ మానియా కొనసాగుతున్న రోజులు. ట్రిపుల్ ఐటీ లో కౌంటర్ స్ట్రైక్ తోపులు అంటే మా క్లాసు టీ-4 (CSE-4 ). 2,000 పై చిలుకు స్టూడెంట్స్, 30+ క్లాసులు, 6 బ్రాంచీలు. అందరూ మా క్లాసు ముందు దిగదుడుపే. మావాళ్లపై గెలుస్తామని పందాలు వేస్కుని కూడా ఓడిపోయిన వాళ్ళు బోలెడు. 

అలాంటి క్లాసులో కౌంటర్ స్ట్రైక్ చాలా లేటుగా మొదలెట్టా నేను. ఒక కారణం అడిక్ట్ అయిపోతానేమో అన్న భయం. ఇంకొకటి తలనొప్పి. అదేంటో ఏ 3D గేమ్ ఆడినా కాసేపటికి తలనొప్పి వచ్చేది. కానీ మా క్లాసు యొక్క ఫేం చూసి నాక్కూడా నేర్చుకోవాలనిపించింది. చిన్నగా మా రషు గాడి పక్కన చేరి ఆట నేర్చుకోవడం మొదలెట్టా. మొదట్లో DEVIL అనే కౌంటర్ స్ట్రైక్ పేరు పెట్టుకుని ఒక మూలన దాక్కుని కాల్చేవాడిని. 

ఆట బాగా వచ్చాక, పేరు ఛత్రపతి గా మార్చుకుని ఆడేవాడిని. ఆ పేరుకి కారణం ఛత్రపతి శివాజీ లాంటి యుద్ధవిద్యలతో నేను కూడా ఆడాలి అని. ఛత్రపతి సినిమా కూడా మన ఫేవరెట్టే అనుకోండి. అంత మంచి పేరు కాస్తా ఛత్రం, పత్రంలా రూపాంతరం చెందింది అంటే అందులో బంటి (గణేష్ పామర్తి) గాడి తప్పు చాలా ఉంది. 

రోజూ రాత్రి నైట్ క్లాసులో, మాలో మేము కౌంటర్ టెర్రరిస్టులు, టెర్రరిస్టులుగా విడిపోయి ఆడేవాళ్ళం. దగ్గర దగ్గరగా 8 మంది టెర్రరిస్టులు 10 మంది కౌంటర్ టెర్రరిస్టులుగా ఆడేవాళ్ళం. 

నేనెప్పుడూ టెర్రరిస్టే. అందరూ కౌంటర్ టెర్రరిస్టులకు ఇచ్చే గన్లు (మావెరిక్) బాగుంటాయి అని కౌంటర్ టెర్రరిస్టులుగా ఆడే వాళ్ళు. నేను మాత్రం టెర్రరిస్టుకి ఇచ్చే గన్ (cv47) ని ఇష్టపడేవాడిని. నేను, మా రషుగాడు, గబ్బర్, యర్రయ్య, రామ్స్, పవర్ కింగ్ రెగ్యులర్ గా టెర్రరిస్టులుగా ఆడేవాళ్లం. మేము అందరం కౌంటర్ టెర్రరిస్టులు చేతిలో ఎప్పుడూ ఓడిపోయేవాళ్ళం. 

ఆ సమయంలో ఛార్లెస్ (ఘనాపాటి ప్లేయర్) మా టెర్రరిస్టుగా ఆడడం మొదలెట్టాడు. ఛార్లెస్ రాకతో మా దశ తిరిగిపోయింది, గెలుపు మీద గెలుపు. ఇక ఆ సమయంలో ఆడడం అంటే చంపటం, గెలవడం ఇదే పద్దతి. మేము వరసగా గెలుస్తున్న సమయంలో, అందరూ అనాసక్తితో ఆటలోంచి డ్రాప్ అయిపోయేవాళ్లు. 

అప్పుడు ఛార్లెస్ పిలిచి "ఎందుకురా ఛత్రం అందర్నీ చంపుతున్నావ్" అన్నాడు నవ్వుతూ. 

"అదేంటి ఆడేది చంపడానికే కదా" అంటే..

"అరే... కొన్నిసార్లు మనం ఓడిపోవాలి కూడా. అప్పుడే Equilibrium ఉంటుంది" అన్నాడు. 

నాకు అర్థం కాలేదు. అప్పుడు చెప్పాడు...

"వరుసగా ఓడిపోతున్నపుడు, ఇంకా బాగా ఆడాలనే అందరూ ఆడరు. కొందరు నిరుత్సాహపడి ఆడటం మానేస్తారు. అందరూ అలా నిరుత్సాహపడి ఆడటం మానేస్తే చివరకి ఆడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. అందుకే కొన్నిసార్లు మనం ఓడిపోయి, అవతలి వాళ్ళని గెలిపించాలి" అన్నాడు. 

సహజంగా ఎలా అయినా గెలవాలి అని తపన పడే నాకు,
ఆ మాటలు అర్థం అవ్వడానికి కొంత సమయం పట్టింది. 

నిజమే కదా, అది ఆ ఒక్క ఆటలోనే కాదు. మన జీవితంలో, మన మాటల్లో కూడా అన్ని సార్లూ మనమే గెలవాలని... మన పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి పాకులాడకూడదు. కొన్ని సార్లు వదిలేయాలి. కొన్ని సార్లు ఓడిపోవాలి. పట్టు విడుపులు ఉంటేనే ఏదైనా నిలుస్తుంది అని అంటారు. అలా ఆ గేమ్ లో ఓడిపోతూ ఛార్లెస్ చెప్పిన మాట నా గుండెల్లో నిలబడిపోయింది. 

అప్పటి నుంచి నేను ఎప్పుడు ఎవర్తో ఆడినా, ఓడినా, గెలిచినా Equilibrium అన్న ఛార్లెస్ మాట మాత్రం అలా చెవుల్లో రింగుమంటూనే ఉంటుంది. థాంక్యూ Assassin 😀

(నా ఆలోచన విధానం మీద ఛార్లెస్ ప్రభావం చాలా ఉంది. ప్రతి ఒక్క టాపిక్ మీద తన వ్యూ పాయింట్ చెప్పేవాడు. అది చాలా కొత్తగా నిజమే కదా అనిపించేలా ఉండేది. సినిమాల మీద పాలిటిక్స్ మీద రిలేషన్స్ మీద గేమ్ మీద మనుషుల మీద మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్న రోజులు బోలెడు. తను అందరితో అలా మాట్లాడతాడో లేదో నాకు తెలీదు. కానీ నేను అలా తర్కించిన కొందరిలో, ఛార్లెస్ మాత్రం ఒకడే. Thank you once again Charlie... for making my life more thoughtful. 💕)


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాదస్తం

ఉప్పూ కారం