లవ్ ఎట్ ఫస్ట్ సైట్
చాలా టీనేజీ ప్రేమలు... గట్టిగా చెప్పాలంటే చాలా ప్రేమలు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లోనే కలుగుతాయి. ఎందుకంటే చాలామందికి ముఖ్యంగా టీనేజీ పిల్లలకి స్కిన్ లవ్ నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది. నాకు మాత్రం అది ఎలా మొదలయ్యిందంటే...
అప్పటికి నేను కాలేజీకి వచ్చి 3 నెలలు అవుతుందేమో. కో ఎడ్యుకేషన్ లో అప్పుడే చదవడం మొదలు మనకి. హలో గురూ ప్రేమ కోసమేలో రామ్ చెప్పినట్టు "మనం కొత్తగా ఎక్కడికైనా వెళ్తే, అక్కడ ఫస్ట్ చేసే పని... ఎవరు బాగున్నారా అని వెతుక్కోవడం". నేను బలంగా ఆ పని చేయలేదు కానీ. నాకు కనపడినంతలో అప్పటికి మా క్లాసులో వాళ్ళు నాకు అంతగా ఆనలా. (No offense to them. మన దరిద్రమైన ఫేస్ కంటే వాళ్ళు చాలా బెటరే. కానీ నా ఎదవ expectations అలాంటివి మరి 🙃)
నాతోపాటు 5th క్లాస్ నుంచి కలిసి చదివిన అబ్దుల్ గాడు, నా తర్వాత వారంకి ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ హాస్టల్ రూంకి రెగ్యులర్ గా వెళ్ళేవాడిని. వాడికి నేను మా క్లాసు గురించి చెప్తే... వాడు ఉండి "మా క్లాసులో ఇద్దరు అమ్మాయిలు బాగుంటారు. ఒకరు ఫస్ట్ రోలో కూర్చుంటారు. ఒకరు లాస్ట్ రోలో కూర్చుంటారు" అన్నాడు.
"నాకు నచ్చరేమో ఈ కాలేజీలో అమ్మాయిలు. ఎందుకంటే అందరూ చిన్న పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు కదా" అన్నా. అప్పటికి నేనేదో ఆంస్టర్ డ్యామ్ నుంచి ఊడిపడినట్టు.
"లేదు లేదు నీకు నచ్చచ్చు. కావాలంటే సాయంత్రం నైట్ క్లాసు దగ్గరకి ఒకసారి రా" అన్నాడు నా టేస్టులు బాగా తెలిసిన అబ్దుల్ గాడు. సరే చూద్దాం అంటూ వెళ్ళా.
రాత్రి 8 అప్పుడు వాళ్ళ క్లాసును చూస్తూ దూరంగా నించున్నాం. మన లెగ్గు వేళా విశేషం, ఆరోజు రాత్రి కరెంట్ పోయింది. అందరూ క్లాసు బయట చీకట్లో వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఎవరో ఇద్దరు silhouette ఎఫెక్ట్ లో నడుచుకుంటూ వస్తుంటే, మా వాడు "అదిగో వాళ్ళే చూడు చూడు" అన్నాడు.
అల్లంత దూరం నుంచి చీకట్లో వాళ్ళ మొహాలు నాకేం కనపడలా. ఇంతలోనే వాళ్లు వచ్చి క్లాసు బయట నుంచున్న గుంపులో కలిసిపోయారు. కరెంటు వచ్చింది అందరూ క్లాసులోకి వెళ్లిపోయారు. మా వాడు కూడా వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ మొహాలు మాత్రం కనపడలేదు. సరే మన ప్రాప్తం అనుకుంటూ వెళ్ళిపోయా నేను.
ఆ సంవత్సరంలో ప్రతి హాస్టల్ రూంకి (డార్మిటిరీ) ఒక లెక్చరర్ (మెంటార్) ని అసైన్ చేశారు. ఎవరు సెలవకి వెళ్ళాలన్నా అతని పెర్మిషన్ తీస్కోవాలి. మా రూంకి అసైన్ అయిన సర్ పేరు ప్రసాద్ అనుకుంటా, గుంటూరు ఆయన, ఇంగ్లీష్ చెప్పేవాడు వేరే క్లాసు వాళ్ళకి. మా ఊర్లో ఉన్న 130 ఏళ్ల చర్చి, ఆంధ్రాలోనే చాలా పెద్దది. క్రిస్టమస్ బాగా జరుగుతుంది, దానికి నన్ను తీస్కెళ్ళడానికి మా నాన్న వస్తే, సెలవ అడగడానికి ఆ సారు ఉన్న హాస్టల్ రూంకి వెళ్ళా. అక్కడ ఉన్నవాళ్లు, ఆయన ఏదో క్లాసులో ఉన్నారు అని ఆ క్లాసు పేరు చెప్పారు.
నేను, మా నాన్న లీవ్ లెటర్ పట్టుకుని ఆ క్లాసు దగ్గరకు వెళ్ళాం. సర్ క్లాసులో కూర్చుని ఉన్నారు. అందరూ సైలెంట్ గా చదువుకుంటున్నారు. నేను క్లాసు బయట నుంచి "May I come in Sir" అంటూ లోపలకి వెళ్ళా. వెళ్ళగానే మా అబ్దుల్ గాడు "హాయ్" అంటూ చిన్నగా చెయ్యి ఊపాడు. ఓహో ఇది అబ్దుల్ గాడి క్లాసా అనుకుంటూ లీవ్ లెటర్ సార్ కి ఇచ్చా. ఆయన చూసి సైన్ పెట్టే రెండు సెకండ్లలోనే ఫస్ట్ రోలో మూలన కూర్చున్న అమ్మాయి వైపు ఒక లుక్కేసా.
చాలా బాగుంది ఆ మొహం. లక్షణంగా ఉంది అన్న ఇంప్రెషన్ ఫస్ట్ లుక్ లో కలిగింది. సర్ సైన్ చేసి పేపర్ ఇవ్వగానే తిరిగి వెళ్ళిపోయా. తర్వాత ఇక మార్కుల వేటలో పడి, ఏదో ఇంకొక్కసారి తప్ప ఎప్పుడూ అబ్దుల్ గాడి క్లాసు వైపు పెద్దగా వెళ్ళలేదు.
ఒక ఆరు నెలల తర్వాత అనుకుంటా... కొత్త బిల్డింగులు కట్టారు అని, రేకుల షెడ్డుల నుంచి మమ్మల్ని అందర్నీ కొత్త బిల్డింగులకి మార్చారు. కొత్త క్లాసులు, కొత్త హాస్టళ్లు. అప్పుడే PUC-2nd ఇయర్ క్లాసులు అంటూ, అమ్మాయిలని మార్చి కొత్త వాళ్ళని వేశారు.
అప్పుడే మా అబ్దుల్ గాడు మళ్ళీ కలిశాడు. మా క్లాసు అమ్మాయిల్ని మీ క్లాసుకే వేస్తున్నారంట అని నాకు చెప్పాడు. నీకు నచ్చిన అమ్మాయి ఈ క్లాసులో పడుతుందో, పక్క క్లాసులో పడుతుందో తెలీదు కానీ మీ దగ్గర్లోనే పడుతుంది అని చెప్పాడు.
సరే చూద్దాం అంటూ కొత్త క్లాసు దగ్గరకి వచ్చినప్పటి నుంచీ చూస్తూనే ఉన్నా. ఒకరోజు కెమిస్ట్రీ క్లాసు అనుకుంటా... జరుగుతూ ఉంది. ఏదో ప్రశ్న అడగడానికి 2nd రోలో కూర్చున్న ఒక అమ్మాయి లేచి పక్కనే నిలబడ్డా సర్ దగ్గరకు వచ్చింది. చూడు ఆ అమ్మాయి బాగుంది అన్నాడు నా పక్కన ఉన్న సురేష్ గాడు. ఆ అమ్మాయిని చూసాను.
చాలా ఫెమిలియర్ గా అనిపించింది ఆ మొహం. అబ్దుల్ గాడి క్లాసులో చూసిన అమ్మాయి తనే అనిపించింది. ఇంకా ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉంది. బహుశా మా బంధువుల్లో ఎవరి పోలికలైన ఉన్నట్టున్నాయి.
అలా చూస్తూ ఉండిపోయా. ఒకరోజు కాదు, ఒక నెల కాదు... ఆ సంవత్సరం మొత్తం. ఆ క్లాసులో నేను చదివినంత కాలం, ఆ అమ్మాయినే చూస్తూ ఉండేవాడిని. మా రాంబాబుని, శివ గాడిని, మా విజయ్ ని ఎన్ని సార్లు అడిగేవాడినో... "ఒరేయ్ అసలు ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అంటారా?" అని. అందరూ సమాధానంగా నవ్వే వాళ్ళు. వేరే కొందరు అయితే, నీ మొహానికి ఆ అమ్మాయి కావాలా అన్న వాళ్ళు కూడా ఉన్నారు.
అయినా సరే ఏదో పిచ్చి ధీమాతో ఆ క్లాసులో నేను వెయ్యని వేషాలు లేవు. నా దరిద్రపు గొట్టు వేషాల వల్ల తనని నేను ఫాల్లో అవుతున్నా అనే విషయం తనకు చివరకి తెలిసింది. తర్వాత అలా క్లాసులు మారాక తన ఫోన్ నంబర్ కనుక్కుని చాలా కష్టాలు పడి మాట్లాడడం మొదలెట్టాను అనుకోండి. ఆ కథ అంతా ఇక్కడ రాశాను.
నేను మొదట మొదలెట్టిన విషయం దగ్గరకే వద్దాం. నాది లవ్ అట్ ఫస్ట్ సైటే. స్కిన్ లవ్వే. కానీ అది బంధంగా మారి, బలపడి, పెళ్లి దాకా వచ్చిందంటే మాత్రం అది ఆ అమ్మాయి మంచితనం. తనను చూసిన తర్వాత, తనతో చాట్ మొదలెట్టడానికి ముందు... తన గురించి ఎవ్వరినీ అడిగినా అందరూ ఒకే మాట, తను చాల మంచిది అని, చాలా సైలెంట్ అని. నా గురించి వంద మందిని అడిగితే 90 మంది, వాడు మంచోడు కాదు. సెల్ఫిష్, జాగ్రత్తగా ఉండాలి, గొడవలు పడేవాడు ఇలా అందరూ బ్యాడ్ గానే చెప్తారు. కానీ తన గురించి వందకు వంద మందీ మంచిగానే చెప్తారు.ఇప్పటికీ మా ఫ్యామిలీ లో కానీ, తన ఫ్యామిలీలో కానీ, తన కొలీగ్స్ లో కానీ ఎక్కడైనా తనకి మంచి మార్కులే ఉంటాయి.
కారణం మంచిగా ఉండాలని ఉండడం కాదు, అది తన సహజ లక్షణం. నాలాంటి ఒక కంట్రోల్ ఫ్రీక్ ని ఒకరు ప్రేమించడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే తను నాకు దొరకడం నా అదృష్టం. తనని నేను ప్రేమించడం తన దురదృష్టం. అలాంటి నన్ను ఓపిగ్గా భరించి, ప్రేమించి, ఇప్పుడు మా అమ్మలా పెంచుతున్న నా భార్య కి థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా తక్కువ.
అదండీ నా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథ. మీరూ ఫస్ట్ సైట్ లోనే ఇష్టపడండి... కానీ ఒద్దిగ్గా, మంచితనం ఉన్న అమ్మాయిని మాత్రమే ప్రేమించి పెళ్లి చేస్కోండి. లేకపోతే చాలా కష్టం సుమీ...!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి