చివరకు కొంత మిగల్చాలి
చిన్నప్పుడు నాకు గారెలంటే మహా ఇష్టం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మాకు, మా నాన్న వారానికి ఒకసారి బయట నుంచి గారెలు తెచ్చేవాడు. మనిషికి 2 గారెలు వచ్చేవి. ఆ గారెలు పప్పులోకో సాంబారులోకో తినేవాళ్ళం. అన్నం తినడానికి కూర్చోగానే, నేను లటుక్కున గారెల్ని ప్లేట్లో వేసేస్కుని రెండు ముద్దల్లో రెండు గారెల్నీ తినేసేవాడ్ని.
అవి అయిపోగానే, మా నాన్న వైపు బేలగా... "గారెలు అయిపోయాయి నాన్న" అంటూ చూసేవాడిని.
అప్పుడు నాన్న "అందుకే వాటిని ముందే తినేయకూడదు. చివర వరకు ఒక్కో ముద్దలో కొంచెం కొంచెం తినాలి. చివరకు మిగిలితే ఒకేసారి తినేయొచ్చు" అని చెప్పాడు. అప్పటి నుంచి ఏం తిన్నా... స్వీట్లు కానీ బిర్యానీ కానీ, ప్రతీ మంచి ఐటెం చివర వరకు ఉంచుకుని కొసరి తినేవాడిని.
***
అలా భోజన ప్రియుడిని అయిన నేను, ట్రిపుల్ ఐటీకి వచ్చినప్పుడే మొట్ట మొదటిసారి కో ఎడ్యుకేషన్ లో చదవడం మొదలెట్టా. అప్పటి వరకు అమ్మాయిల్ని దూరం నుంచి చూడడమే తప్ప, కనీసం మా బంధువుల్లో కూడా తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. అందరూ అబ్బాయిలే. ఎప్పుడు బాయ్స్ స్కూలే. అమ్మాయిలు కూడా మన లానే ఉంటారా... మామూలుగా మాట్లాడతారా? సినిమాల్లో హీరోయిన్ల లానే ఉంటారా అనే వంద ప్రశ్నలు ఉండేవి.
అలాంటి నాకు కాలేజీకి వచ్చాక ఏ అబ్బాయి అయినా, అమ్మాయిలతో మాట్లాడితే... అదొక వింత. ఎవరు ఎవర్తో అయినా మాట్లాడితే అదొక హఠాత్పరినామం. అందరితో అదొక సినిమా కథలా చెప్పేవాడిని. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మామూలుగా మాట్లాడితే అది లవ్వే అని ఫిక్స్ అయ్యే కోట్లాది మంది టీనేజ్ గొర్రెల్లో నేను కూడా ఒకడిగా ఉండేవాడిని.
అలాంటి సమయంలో నేనే ఒక అమ్మాయితో మాట్లాడితే... ఇంకేమైనా ఉందా... కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే. ఇక నేను ఒక అమ్మాయితో చాట్ చేయడం మొదలెట్టాక, అది అందరికీ గొప్పగా డప్పు కొట్టుకుని చెప్పుకున్నా. అది అలా అలా అందరికీ తెలిసింది. నేను చాట్ చేసిన ఆ అమ్మాయికి కూడా తెలిసింది. ఎందుకు ఇలా చెప్పుకుంటున్నావు అని అడిగింది. సెల్ఫ్ డబ్బా అని తప్ప వేరే సమాధానం నా దగ్గర లేదు. అప్పుడు తను నన్ను అవాయిడ్ చేయడం మొదలెట్టింది.
ఆ సమయంలో నా సన్నిహితుడు నాకు ఒక మాట చెప్పాడు. "ఇది ఒక మంచి ఏజ్. అమ్మాయిలతో మాట్లాడ్డం, వాళ్ళని బయట కలవడం. ఇవన్నీ చాలా కొత్తగా, క్రేజీగా ఉంటాయి. చాలా స్వీట్ మెమోరీస్. వెంటనే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి అనిపిస్తుంది. కానీ అలా చెప్పడం వల్ల, దానికి ప్రచారం జరగడం వల్ల ఆ అమ్మాయికి జరిగే నష్టం చాలా ఎక్కువ.
అందుకే ఆ స్వీట్ మెమోరీస్ అన్నీ చివరకు దాచుకో. ఎవ్వరికీ ఇప్పుడు ఏం చెప్పొద్దు. నీ లవ్ సక్సెస్ అయ్యాక, పెళ్లి అయ్యాక అప్పుడు అందరికీ ఆ స్టోరీలు చెప్పు. చివరకు కొన్ని స్వీట్ మెమోరీస్ మిగలాలి కదా" అన్నాడు.
నాకు మా నాన్న తిండి విషయంలో చెప్పిన మాటలు, ఇప్పుడు నా సన్నిహితుడు చెప్పిన మాటలు ఒకేలా అనిపించాయి. మనకు నచ్చింది కదా అని ముందే అన్నీ తినేసి, మనకి తెలిసింది కదా అని ముందే అన్నీ చెప్పేస్తే... చివరకు మిగిలేది ఏది ఉండదు. తీరని నష్టాలు తప్ప.
అప్పటి నుంచి ఆ అమ్మాయితో చేస్తున్న చాట్ విషయాలు ఏవీ ఎవ్వరికి చెప్పలేదు. సరిగ్గా ఆ సమయంలోనే బ్రాంచ్ డివిజన్ వల్ల హాస్టల్స్ మార్చారు. ఇక నేను అజ్ఞాతవాసం మొదలెట్టా. నా CSE-4 స్నేహితులు 95% మందికి అసలు నేను ఇలా ఒకర్ని ప్రేమిస్తున్నా అన్న విషయం కూడా తెలీదు. అందరూ నేను సీక్రెట్లు మెయింటైన్ చేస్తాను అనుకునే వాళ్లు. వాళ్లకు తెలీదు, ఒకప్పుడు నేను సీక్రెట్స్ దాచడం అంటే తెలీనివాడిని అని.
ఆ సన్నిహితుడి మాట మీదే నా స్నేహితులు ఎవ్వరికి నా లవ్ స్టొరీ చెప్పలేదు. పెళ్లి అప్పుడు మాత్రం కొంచెం చెప్పాను. డీటెయిల్డ్ స్టోరీ మాత్రం నాకు యాభై, అరవై ఏళ్లు వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నా. కానీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను అంటే కారణం ఇది.
మీరు కూడా మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నపుడు వాటి గురించి మొదట్లోనే అందరికీ చెప్పకుండా చివరకు సక్సెస్ అయ్యాక, ఒక సక్సెస్ స్టోరీలా చెప్తే అదొక స్వీట్ మెమోరీగా మిగిలిపోతుంది. ఏమంటారు?? 😃😃
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి