చాదస్తం

"జాహ్నవి లంచ్ బాక్స్ రెడీ అయిందా?" రూంలోంచే కేక వేశాడు నివాస్. 

"అవుతుందండీ" అంటూ చెమటలు తుడుచుకుంటూ గబగబా వంటింట్లో పరిగెడుతోంది జాహ్నవి. 

"ఏంటమ్మా అబ్బాయి ఇప్పుడేగా లేచాడు... అప్పుడే బాక్స్ అని కేకలు వేస్తాడేంటి" తెలియక అడిగింది ఆరోజే ఊరి నుంచి వచ్చిన నివాస్ వాళ్ళ అమ్మమ్మ లక్ష్మమ్మ. 

"అంతే బామ్మ, రాత్రి పని పూర్తి చేసుకుని పడుకునేసరికే ఒంటిగంట. ఇక లేచేది 8కి, ఆఫీసులో 9 కల్లా ఉండాలని పరిగెడతాడు." కూరలు సర్దుతూ చెప్పింది జాహ్నవి. 

"అయ్యో... ఇదేంటే" చోద్యంగా చూసింది లక్ష్మమ్మ. ఊరులో త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటైన లక్ష్మమ్మ, ఇదే మొదటిసారి మనవడి దగ్గరకి హైద్రాబాద్ రావడం. జాహ్నవికి ఏదో ఒంట్లో నలతగా ఉందంటే, అందరూ వేరే పనుల్లో బిజీగా ఉండేసరికి తానే ఓ పదిరోజులు ఆ దంపతులకు చేదోడు వాదోడుగా ఉందామని వచ్చింది. బస్సు దిగి వచ్చినప్పటి నుంచి జాహ్నవి పరుగులు, నివాస్ మొద్దు నిద్ర చూసి ముక్కున వేలేస్కుంది. 

8.20 కల్లా బోనులోంచి సింహం వచ్చినట్టు ఒక్క ఉదుక్కున్న గబగబ నివాస్ రూంలోంచి బయటకు వచ్చి బ్యాగ్గు సర్దుకుంటున్నాడు."ఏంటి అమ్మమ్మ ప్రయాణం ఎలా జరిగింది?" అంటూ బ్యాగ్గు సర్దుకుంటూనే అడిగాడు. 'ఆ బాగానే జరిగిందిరా' అంటూ జాహ్నవి దగ్గరకు వెళ్లి "అమ్మా... నువ్వు వాడికి టిఫిన్ పెట్టు. పాత్రలు నేను కడుగుతా" అంది. 

"అయ్యో ఆయన టిఫిన్ తినరమ్మమ్మా. టిఫిన్ మనవరకే. తను ఆఫీసులో కుదిరితే కాఫీ తాగుతారు లేకపోతే ఒకేసారి లంచ్ బాక్స్ అంతే" 

ఆశ్చర్యంగా "అదేంట్రా నివాస్ అలా టిఫిన్ తినకపోతే ఎలా... ఆరోగ్యం పాడయిపోదూ" అంటూ విస్తుపోయి అడిగింది లక్మమ్మ. 

నివాస్ బ్యాగ్గు సర్దుకునేవాడల్లా అలా ఆగిపోయి... "అమ్మమ్మా... నాకు రాత్రి 1 వరకు మీటింగు. కనీసం 7 గంటల నిద్ర లేకపోతే నాకు పిచెక్కుతుంది. ఇంటి నుంచి ఆఫీసుకు మినిమం 45నిమిషాలు. ఇక 8 కి లేచాక మళ్ళీ ఆఫీసుకు 9 కల్లా వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది చెప్పు" అని షూ సర్దుకోవడం మొదలెట్టాడు. 

"అంత పని ఉంటే... వేరే సాఫ్టు వేర్ ఉద్యోగం వెతుక్కో. అంతే కానీ ఇలా తిండి మానుకుంటే ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిద్ది. పోయిన ఆరోగ్యం మళ్ళీ తిరిగి వస్తుందా" అంటూ కోపంగా అన్నది లక్మమ్మ. 

నివాస్ కి అసహనం ముంచుకు వచ్చింది. "చాదస్తం ఆపు అమ్మమ్మ. ఇప్పటికిప్పుడు ఎలా టిఫిన్ తిని వెళ్తాను. అసలు మా సాఫ్టు వేర్ కంపెనీల్లో పని చేసే సగం మంది టిఫినే తినరు. నీకు అవన్నీ తెలీవు. మళ్ళీ అరవడానికి మాత్రం అరుస్తావు" అంటూ హడావడిగా బైకు కీస్ సహా అన్నీ తీసుకుని బయల్దేరాడు. 

నివాస్ అసహనం చూసి మూగబోయింది లక్ష్మమ్మ. "సర్లే ఫీల్ అవ్వమాకు. సాయంత్రం వచ్చి మళ్ళీ మాట్లాడతా" అంటూ నివాస్ గుమ్మం దాటేలోపు... జాహ్నవి "హాచ్" అంటూ తుమ్మింది. 

వెళ్ళే నివాస్ కాస్త ఆగిపోయాడు. "ఛీ... ఏం దరిద్రంరా బాబు" అంటూ చిరాగ్గా వెనక్కి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. ఒంట్లో నలతగా ఉన్న జాహ్నవి మీద అరవలేక, తనలో తానే తిట్టుకుంటూ టైం చూస్తూ కూర్చున్నాడు. 

మెల్లగా నివాస్ పక్కకెళ్ళి కూర్చుంది లక్మమ్మ. 

"ఏయ్యా ఆఫీసుకి టైం అయింది కదా...వెళ్లకుండా కూర్చున్నావేంటి?" అంది. 

"తుమ్మిందిగా ఆ మహాతల్లి" అంటూ జాహ్నవి వైపు కొరకొరా చూసాడు. 

"తుమ్మితే బయటకు వెళ్లకుండా ఆగిపోవాలని ఏ వేదంలో రాసుంది బంగారు?" అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ. సమాధానం లేదు నివాస్ నుంచి.

మెల్లగా చెప్పసాగింది అమ్మమ్మ "ఎవరైనా బయటకు వెళ్తున్నపుడు, ఇంట్లో ఎవరికైనా నలతగా ఉండి తుమ్మితే... వారికెలా ఉందో చూసుకోడానికి ఓసారి ఆగమని మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఆ ఆచారం వచ్చింది తప్ప... ఏ పురాణంలోనూ ఏ వేదంలోనూ తుమ్మితే ఆగమని చెప్పలేదు నాన్న. కానీ పొద్దున్నే అల్పాహారం తినకపోతే, మన దేహంలో చక్కెర పడిపోతుంది అని ఫారిన్ డాక్టర్లతో సహా ప్రకృతి వైద్యులు కూడా చెప్పారు బంగారు" 

తలెత్తి చూసాడు నివాస్. నివాస్ మీద చెయ్యేసి లక్ష్మమ్మ "తుమ్మితే వెళ్ళేవాళ్ళు కాస్తా ఆగిపోవడం అనే ఆచారాన్ని చాదస్తం అని నేననచ్చో లేదో కానీ... పొద్దున్న టిఫిన్ తినకపోతే ఏం కాదు అని అనుకోవడం మాత్రం ముమ్మాటికీ చాదస్తమే" అని చెప్పి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది అమ్మమ్మ. 

మెల్లగా నడుస్తూ వెళ్తున్న 75 ఏళ్ల అమ్మమ్మను చూస్తూ అలా స్తబ్దుగా ఉండిపోయాడు పాతికేళ్ల నివాస్.


- నిర్మల్ ప్రవీణ్ లింగిశెట్టి




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడాలంటే ఓడాలి

ఉప్పూ కారం