అవరోహణం
అనంతపురం జిల్లాలో ఉన్న చానా ఊర్ల లెక్కనే యాలేరు కూడా వట్టిపోయిన భూములు, ఎండిపోయిన తుమ్మచెట్లు, అడుగంటి పారుతున్న పెన్నా వాగుతో నిర్జీవంగా ఉంటుంది. అలాంటి ఊర్లో కూడా బలిజయ్య చాలా చలాకీగా, హుందాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. పొద్దన్నే తన 20 ఎకరాల శనిక్కాయి చేనుకి వెళ్ళొచ్చి స్నానం చేసి ఊర్లో అరుగు మీద పెద్ద వేప చెట్టు కింద ఒక్కడే తెల్లబట్టలు వేస్కుని కూర్చుని చుట్ట కాలుస్తా అందర్ని నవ్వుతూ పలకరిస్తా ఉండేటోడు. ఆ నవ్వుకి కారణం ఆ శనిక్కాయి చేను యాదో లచ్చలు ఇచ్చేస్తాందని కాదు, అదిచ్చేది సంవత్సరానికి ఎనభై నూర్లే. కానీ బలిజయ్యకి ఎన్టీవోడు అంటే భలే ఇష్టంలే. ఆయప్ప సీయం అయ్యేతూరికి బలిజయ్య నవ్వు రెండింతలు అయ్యిండాది.
అది చూసి చూసి కొందరికి అసూయ పుట్టింది. బలిజయ్యకి బౌ పొగురప్ప అనుకున్యారు.
బలిజయ్య కూడా తక్కువేం కాదు, మాట్లేడేకి మంచిగా మాట్లాడతాడు కాని పెద్దోళ్ళు కనిపిస్తే
దణ్ణాలు పెట్టడం. లేచి నుంచోవడం లాంటి పద్దతులేం తెల్వబడవ్. కానీ రోజూ మంచిగా అరుగుదగ్గర
కూర్చుని తన పర బేధం లేకుండా, కల్మషం లేకుండా నవ్వుతాడు, మాట్లాడతాడు.
ఓరోజు పొద్దన్నే అట్లే కూర్చుని ఉంటే సిమెంటు ఫ్యాక్టరీకి షిఫ్టుకు వెళ్తున్న
ఓబులేసు ఆగి... "నమస్తే బలిజన్న... ఎట్లుంది ఈ తూరి పొలం... లెక్క సక్కగా వస్తాందా"
అన్యాడు. "యాదో నడస్తాంది లేబ్బా. వర్షాలు బానే పడ్తాండాయి గాని వాగే నిండట్లే.
నీదెట్లుంది ఫ్యాక్టరీ?"
"మీ రైతులకున్న ఆత్మగౌరవం మాకేడిది అన్న. ఒకని కింద గొడ్డు లెక్కన చేయాలి. ఒల్లంతా
హూనం జేస్కుని గొడ్డు లెక్కన చేస్తే నెలకి 500 ఇస్తాండారు. ఇల్లు కూడా ఏం నడవట్లే.
ఒక్క నూరుంటే ఇస్తావా అన్న" దీనంగా అడిగిన్యాడు.
"ఇద్దోబ్బా... మొహమాటం పడాకు. నీకు కుదిరినప్పుడే ఇవ్వు" అంటూ నవ్వుతూ తన
తెల్లచొక్కా జేబిలోంచి తీసి ఇచ్చాడు. మొహం
వెయ్యి వోల్టుల లైటు అయిపాయి "నువ్ మంచోనివి అన్నా. ఊర్లో ఇప్పటి దాంక ఇంకో జెండా
ఎగిరిందే లేదు. అట్ల చూడు ఎన్టీవోడి జెండా ఎట్లా ఎగురుతాందో అంతా నీ వల్లనే"
అని వెళ్ళిపోయాడు. బలిజయ్య మాత్రం సంతృప్తితో జెండానే చూస్కుంటా ఉండిపాయినాడు. మరి
ఈ ఎనభై మూడు ఎలెచ్చన్లలో కాలికి బలపం కట్టుకుని ఊరల్లా తిరగబల్లే ఎన్టీవోడికి ఓటు
వేయమని. అందుకే ఇప్పుడు ఆయప్ప గెలిచేసర్కి అంత ఆనందం.
***
యాందో రెండేండ్లు గడిసిపాయె కానీ పెన్నా వాగు మాత్రం అట్టే రాలేదు. వర్షాలు
పడతాండాయి కానీ పొలానికి మాత్రం నీళ్ళు రాలే. సక్కగా ఉండే పొలం బీళ్ళుపట్టి నెర్రెలిస్తాంది.
ఊళ్ళో ఉన్న మిగతా పొలాల పరిస్థితి కూడా అంతే. ఏమని వాకబు చేస్తే పైనున్న కర్ణాటకలో
యాదో డ్యాము కట్టారంట. ఆడ నీళ్ళు ఆపబట్టి ఈడ దాక నీళ్ళు రావట్లేదని పక్క రైతులు చెప్పారు.
ఇట్లనే చూస్తాంటే ఇంగ ఇల్లు నడిసేకి కూడా కష్టమని, ఎవరో చెప్పారని రైతులు
అందరు పెద్దిరెడ్డి దగ్గరకి పని అడిగేకి పోయినారు. పెద్దిరెడ్డి పెద్ద ఆసామి. ఊళ్ళో
ఎన్టీవోడి పార్టీ రాకముందు నడించిండేదంతా ఆయప్ప పార్టీయే. ఇప్పుడు ఆయప్ప ఓడిపోయినా
చాలా వ్యాపారాలు నడస్తా ఉండాయి. యాదోదాంట్లో పనిస్తాడ్లేప్పా అనుకుంటా వెళ్ళినారు బంగ్లా
అంతటి పెద్దిరెడ్డి కొంపకి. బెరుకు బెరుగ్గ పోయినాడు బలిజయ్య.
"అర్రెర్రె ఎంత కష్టమొచ్చినాదప్ప మీకు" అంటూ అద్దంలో తలదువ్వుకుంటూ
అన్యాడు సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న పెద్దిరెడ్డి. "చూడి... ఇప్పుడు మిమ్మల్ని
నా మైన్లకో ఫ్యాక్టరీలకో వర్కర్ల కింద పంపే మనసు కాదు నాది. ఇన్యాల్లు సక్కంగా ఏటికి
వందా.. ఎనభై నూర్లు సంపాదించే మీకు ఆ పన్లొద్దు. కానీ ఎట్లా మీకిప్పుడు పనిలేకపోతే..."
అనుకుంటూ తర్జుమాలో పడ్డాడు పెద్దిరెడ్డి.
యాదో పనుంటే సూపియ్యి సామి చేస్కుంటాం అన్నారు బలిజయ్యతో వచ్చిన రైతులు, నిలబడే.
"అట్లనా.. అయితే, నాది నాటుసారా బట్టీలు ఉండాయబ్బా. ఎన్టీవోడు వచ్చాక మద్యపాన
నిషేధం అని పెట్టుండ్లా. దాంతో, పక్క ఊర్లల్లో మన మద్యానికి డిమాండు వచ్చింది. ఊరికే
సాంబారు చేసినట్టు చేయల్ల ఒక 2-3 రోజులు. మంచిగా చేస్కుంటే లెక్క బానె వస్త్యాది. కాకపోతే
పోలీసు రైడ్లు అవతా ఉంటాయి అప్పుడప్పుడు. రాత్రిళ్ళు బాగా చూస్కోవల్ల. ఏం? చేస్తారా?"
అని గంభీరంగా అడిగిన్యాడు రెడ్డి. సరే సామి అంటూ అందరూ వెళ్ళిపోయినారు. రైతులకి తలా
ఒక బట్టి ఇచ్చినారు దూర దూరంగా తుమ్మచెట్ల మధ్యల్లో ఎక్కడో.
***
బలిజయ్యకి ఇచ్చిన బట్టీకి మద్యం చేసేటోడు ఒకడ్ని, దాని సరుకులు తెచ్చేటోడు
ఒకడ్ని ఇచ్చారు. మద్యం అయ్యాక సప్లై మాత్రం బలిజయ్య చేయల్ల. రాత్రిల్లు చేసే పని. తుమ్మ
చెట్ల మధ్యలో రాత్రిళ్ళు ప్రయాణం రొంత భయమైనా... రెడ్డికి ఇచ్చేయగా లెక్క దండిగానే
మిగిలేది. నెలకి పదైదు ఇరువై నూర్ల చొప్పున రెండు నెలలు బానే సాగింది. ఇంతకు ముందులా
కాకపోయినా బలిజయ్య మొహం మీద చిరునవ్వు ఇంకా అట్టే ఉండాది. ఓ వెన్నెల రాత్రి, కట్టెల
పొయ్యి మీద మద్యం కాగుతా ఉండాది. బలిజయ్య ఒక్కడే సొగం నిద్రమద్యలో తూలతా ఉన్యాడు. యాడ
నుంచి వచ్చాడో, అకస్మాత్తుగా మీదకి దూకినాడో పోలీసు. "కల్తీ లిక్కర్ కాస్తార్రా
నాకొడకా..." అంటూ బలిజయ్య పీకని వెనక నుంచి మోచెతితో పట్టు పట్టాడు. బలిజయ్యకు
ఊపిరి ఆడట్లే. ఇంకొక్క క్షణం ఉంటే చస్తానేమో అనిపించి బలం మొత్తం తెచ్చుకుని ఒక్కసారిగా
ఆ పొలీసుని గిరవాటు వేసి కొట్టాడు.
ఊపిరి తిరిగి ఆడింది. చచ్చిపోతా అనుకున్నవాడు బ్రతికిఉన్నాడు. కానీ ఒక్క క్షణం
వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఎదో కొబ్బరికాయ పగిలిన శబ్దం వినిపించినట్టు యాదికయింది.
పక్కకి తిరిగి చూస్తే రక్తపు మడుగులో పడిఉన్నాడు పోలీసు. నాడి పట్టుకుని చూశాడు. ఏమీ
చలనం లేదు. భయమేసింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. సరాసరి రాత్రి పెద్దిరెడ్డి బంగ్లాకి
పరుగులు పెట్టాడు. జరిగింది మొత్తం చెప్పాడు. "అర్రెర్రె ఎంత పని చేస్తివప్పా.
పోలీసోన్ని చంపేస్తివా. అట్లే తప్పించుకుని పారిపోయినా సరిపోయేది కదప్పా. అట్లెట్లా
చంపేస్తివి. అసలే ఇది బై ఎలెక్షన్ టైము. సరే ఇంటి కిందా ధాన్యం దాచే స్థలం ఉంది అక్కడ
దాక్కో నేను చెప్పేదాకా" అని ఆఘ మేఘాల మీద బయటకు ఉరికినాడు పెద్దిరెడ్డి.
ఆ చీకటి కొట్టులోనే తెల్లారే దాకా చెమటలోనే కాదు ఆలోచనలతో ఉగ్గిపోయాడు బలిజయ్య.
తనకో 9 ఏళ్ళ కూతురు, తనకోసమే ఎదురుచూసే భార్య. ఈ నేరంతో తను జైలుకి వెళ్తే వాళ్ళ పరిస్థితి
ఏంటి? తెలీదు. జీవితంలో మొదటిసారి జీవన్మరణ సమస్య అంటే ఏంటో తనకు తెలిసి వస్తూ ఉంది.
పొద్దన్నే ఎవరో తలుపు తీసి హాల్లోకి తీస్కెళ్ళారు. చేతులు కట్టుకుని నిలబడ్డాడు బలిజయ్య.
పెద్దిరెడ్డి తో పాటు ఒక నలుగురైదుగురు తన తోటి రైతులు ఉన్నారు. నిశ్శబ్దాన్ని
చేధిస్తూ మాట్లాడ్డం మొదలెట్టాడు పెద్దిరెడ్డి "పోలీసు కోమాలో ఉన్నాడు. చచ్చిపోయాడు
అంటున్నారు. కేసు పెట్టకుండా రాజీ కోసం ఇరవై వేలు అడుగుతున్నారు బలిజయ్య. ఇస్తావా?"
"అంత సొమ్ము నా దగ్గర లేదు సామీ" "మరి ఎట్లా?" డైలమాలో పడ్డాడు
రెడ్డి. "పోనీ నేను నీ బదులు నేను ఆ 20 వేలు కట్టి వాళ్ళతో రాజీ కుదిరిస్తా. నాకు
నీ 20 ఎకరాలు రాసిస్తావా?" అడిగాడు రెడ్డి. ఏం చెప్పాలో అర్ధం కాక అయోమయంగా చూశాడు
బలిజయ్య. "దాంతో పాటు నా మైనులో జీవితాంతం ఉద్యోగం ఇస్తాప్పా పర్లేదా?" అవును
అనక తప్పలేదు బలిజయ్యకి. ఇలాంటి జీవన్మరణ సమస్య నుంచి బయటపడి జీవితాంతం గౌరవంగా ఒక
ఉద్యోగం అంటే అంతకు మించి ఇంకేం కావాలి.
సరే అని అప్పటికప్పుడు వాళ్ళ సమక్షంలో పేపర్ల మీద సంతకాలు పెట్టి బ్రతుకు
జీవుడా అంటూ బయట పడ్డాడు. బయటకు రాగానే తోటి రైతులు ఉండి, మరి నీకింత సహాయం చేసాడు
రెడ్డి... రేపు పొద్దున బై ఎలెక్షన్లో ఎవరికి ఓటు వేస్తావ్? అన్నారు. నేనే కాదు నా
కుటుంబం మొత్తాన్ని రెడ్డికే ఓటు వేయిస్తా అని తెల్లారి జరిగిన ఎలెక్షన్లో గంప గుత్తగా
ఓట్లు వేసారు బలిజయ్య ఇంటిల్లిపాది.
***
ఎలెక్షన్ మరునాడు తెల్లారే మైనుకి వెళ్ళడానికి బూడిద రంగు యూనిఫారం వేస్కుని,
షిఫ్టు కోసం తయారవుతున్నాడు బలిజయ్య. అతని భార్య ఎందుకో చాలా బాధగా ఉంది. కళ్ళ నిండా
నీళ్ళు నింపుకుని క్యారెజీ కట్టి ఇచ్చింది. షిఫ్టుకెల్లే జనాలతో పాటు బయల్దేరాడు.
అలా వెళ్ళ్తూ
చూస్తే వేపచెట్టు కింద ఖాళీగా బోసిపోయిన అరుగు తనవైపు వెర్రిచూపులు చూస్తున్నట్టు అనిపించింది.
ఊరికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న మైనులో సైరను మోగింది. పని మొదలైంది అరుపులు
గోలల మధ్య. ఎప్పుడూ అలవాటు లేని ఆ బరువులు మోసే పని చేస్తూ చేస్తూ అలసిపోయి చుట్ట కాలుద్దామని
ఆ మైను పక్కన ఉన్న చిన్న గుట్ట ఎక్కి చుట్ట అంటించాడు. ఒక్క ఉచ్చ్వాశ తీస్కుని వదిలాడు.
ప్రశాంతంగా ఉంది. ఆ గుట్ట మీద నుంచి చాలా దూరం కనపడుతోంది. పచ్చని కొండల్ని తవ్వే మైను
అది. చుట్టూ పచ్చదనం. మధ్యలో ఈ బూడిద రంగుపొడిని తవ్వే బూడిదరంగు మనుషులు అనుకుని నవ్వుకున్నాడు.
ఇంతలో తోటి ధూమపాన ప్రియుడు ఒకడు పక్కనే వచ్చి నించున్నాడు తెలిసినవాడికి మల్లే. సూచన
ప్రాయంగా చూసి నవ్వి అలా చూస్తే దూరంగా ఒక వాగు, దాని నుంచి పెద్ద పెద్ద పైపులు ఈ మైనుకి
కలపబడి ఉన్నాయి. ఆ పైపులు ఏంటండి అని అడిగాడు బలిజయ్య. “అవా... యాలేరుకెల్లె పెన్నా
నది వాగు లేదూ, దాని నీళ్ళంతా ఈ మైనుకు తెస్తాయి అవి. రెండేళ్ళ క్రితం దాకా ఈ మైనుకు
నీళ్ళు లేవు.
పెద్దిరెడ్డి మామూలోడా. గవర్నమెంటు వాళ్లది కాకపోయినా యాదో చేసి నీళ్ళు తెప్పించినాడు.
నాకు తెల్సి ఆ యాలేరు ఊరుకి నీళ్ళు కూడా ఉండి ఉండవ్ ఈ రెండేళ్ళు. అయినా ఆడేదో లిథియం
ఉండాదంట అబ్బ. పెద్ద రేట్లు వస్తాయంట ఆ భూములకి. కబ్జా చేద్దామని చాలా రాబందులు తిరగతాండాయి.
ఏమైతాందో మరి అక్కడ” అంటూ తన చుట్టని ముగించేసి వెళ్ళిపోయాడు. బలిజయ్య బుర్ర గిర్రున
తిరగడం మొదలయింది. కాలిన చుట్ట చప్పున చెయ్యిని కాల్చింది. చూస్తే చుట్టే కాదు, వేలు
మీద వేసిన ఓటు ఇంకు కూడా మండుతోంది. ఓసారి మైను దిక్కున చూశాడు తలకి కట్టు కట్టుకున్న
ఎవరో పోలీసు అక్కడే రెడ్డితో నవ్వుతా మాట్లాడతా ఉన్యాడు. ఇంకో దిక్కు దూరంగా యాలేరులో
ఎగురుతున్న ఎన్టీవోడి జండా దించేస్తా కనపడతాంది. ఇంకో జెండా ఎత్తుతాండారు. కనపడతాంది
కానీ కళ్ళు ఎందుకో మసక అయితాండాయి. బహుశా కన్నీళ్ళు అనుకుంటా. జీవితంలో మొదటిసారి వస్తున్నాయి.
ఇంతలో అక్కడే పనిచేస్తున్న ఓబులేసు "యోవ్ బలిజా... ఏందీ ఎవారం... దా వచ్చి పనిచెయ్.
" అంటూ హుకుం జారీచేసాడు. తన దగ్గర నూరు రూపాయలు తీస్కున్న ఓబులేసు ఇప్పుడు ఇక్కడ
తన పై అధికారి. తల తిరుగుతూ ఉండగా అడుగులు ఎటుపడుతున్నాయో చూసుకోకుండానే ఏం మాట్లాడకుండా
తిరిగి పనిలోకి వెళ్ళాడు. ఇప్పుడు బలిజయ్య ఒంట్లో పొగరు లేదు. మొహం మీద చిరునవ్వు కూడా
లేదు.
***సమాప్తం***
(అనంతపురం జిల్లాలోని
గ్రామ పరిస్థితుల్ని అద్దం పట్టేలా ఎన్నో గొప్ప కథలు రాసిన సింగమనేని నారాయణ గారి ఆదర్శంతో
రాసిన కథ.)
చాలా బాగా రాశారు
రిప్లయితొలగించండిఒక మంచి కథ
రిప్లయితొలగించండిచాలా బాగా రాసావు. యాస స్పాట్ అన్. 🤘🤘
రిప్లయితొలగించండియాస, కథ బాగున్నాయి. మీరు మాలాంటి యువత కోసం రొమాంటిక్ కథలు రాస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండి