ఇంట్లో నుంచి పారిపోయిన నా కథ
నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు పేపర్ చదువుతూ ఉంటే ఒక వార్త నా కంట్లో పడింది. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు అనే ఊర్లో ఎక్కడపడితే అక్కడ వజ్రాలు దొరుకుతాయట. వాటికోసం ఎక్కడి నుంచో ప్రజలు వస్తున్నారట. ఆ వార్త చదివి అబ్బా భలే ఉందే అనుకున్నాను. మా నాన్నని ఆ వార్త నిజమేనా అని అడిగాను. అవును అన్నాడు నాన్న. దాంతో నా దగ్గర ఉన్న స్టేట్ మ్యాప్ తీసుకుని ఆ వజ్రకరూర్ ఎక్కడో వెతికాను.
మేము ఎప్పుడూ అనంతపురం వెళ్లేటప్పుడు దారిలో ఉండే, గుంతకల్లు నుంచి ఆ వజ్రకరూర్ చాలా దగ్గరే. అయితే మనం కూడా ఒకసారి వజ్రాల వేట చేయొచ్చు అనుకున్నాను ఆ పిల్ల వయసులో.
ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక miss understanding వల్ల నన్ను మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇరగకొట్టారు. అప్పటికే నవోదయ ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాలా frustration కి గురయిన నేను, ఇక ఇద్దరూ కలిసి కొట్టిన ఈ దెబ్బలతో ఇంటి నుంచి పారిపోదాం అని ఫిక్స్ అయ్యాను. నాలాగే frustration కి గురైన నా ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడు. వాడే నా ఫ్రెండ్ అవినాష్. వాడికి చదువు విషయంలో ఇంట్లో ఉన్న ప్రెజర్ తో చాలా frustration తో ఉన్నానని చెప్పాడు.
"ఇక భరించి లాభం లేదు అవినాష్. మనం ఇంటి నుంచి పారిపోయి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి" అంటూ ఇంటి నుంచి పారిపోవడానికి వాడిని మోటివేట్ చేశాను.
నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనంతపురం అన్నా... అక్కడున్న మా అమ్మమ్మ తాతయ్య అన్నయ్య అన్నా... చాలా ఇష్టం. ఎప్పుడు నేను వాళ్ల ఊరికి వెళ్లినా నన్ను చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు. పైగా మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడైనా తిడుతుంటే "ఎందుకు వాడిని అలా తిడతారు" అంటూ నన్ను బాగా వెనకేసుకుని వచ్చేవాళ్ళు.
దాంతో నా ఎస్కేప్ ప్లాన్లో అనంతపురంని include చేశాను. అలాగే అంతకుముందే చదివిన వజ్రకరూరు ప్లాన్ ని కూడా include చేశాను. అప్పట్లో మా నాన్న రోజు స్కూల్ కి ట్రైన్ లో వెళ్లి వస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళ స్కూల్ కి నన్ను కూడా ట్రైన్ లోనే తీసుకెళ్లేవాడు.అనంతపురం కూడా ట్రైన్ లోనే వెళ్ళేవాళ్ళం. మా ఫ్రెండ్ అవినాష్ ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గరే. సో నా ప్లాన్ లో ట్రైన్ ని కూడా include చేశాను. రైల్లో పారిపోదామని ఫిక్స్ చేశా.
"మనం రైల్లో అనంతపురం వెళ్లే టికెట్ తీసుకుని మధ్యలో వజ్రకరూర్ దగ్గర దిగిపోయి కొన్ని వజ్రాలు ఏరుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ వాళ్ళు మనకి రోజూ ఐస్క్రీమ్లు గోబీ మంచూరియా కొనిస్తారు. మన దగ్గర వజ్రాలు ఉన్నాయి కాబట్టి మనం చదవాల్సిన అవసరం కూడా లేదు" అని ఒక భయంకరమైన nibba ప్లాను వేసాను.
ఆ రోజు మధ్యాహ్నం స్కూల్ అయిపోయాక ఇక ఇంటికి వెళ్ళలేదు. సరాసరి స్కూల్ నుంచి రైల్వే స్టేషన్ కి బయలుదేరాం. రైల్వే స్టేషన్ కి అవినాష్ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్లే దారి తప్ప వేరే దారి మాకు తెలీదు. సరిగ్గా వాళ్ళ ఇంటి ముందుకి వెళ్ళేసరికి అవినాష్ గాడు "మా ఇంట్లో నా బ్యాగ్ పెట్టేసి వస్తా" అని అన్నాడు. నేను "వద్దు నాతో కూడా బ్యాగ్ ఉంది, నువ్వేమి లోపలికి వెళ్ళద్దు" అన్నాను. "లేదు జస్ట్ ఒకసారి లోపలికి వెళ్లి నీళ్లు తాగి వచ్చేస్తా" అన్నాడు. "సరే" అని వాళ్ల ఇంటి అరుగు మీద కూర్చున్నాను.
పది నిమిషాలు అయింది రాలేదు. పావుగంట అయింది రాలేదు. అరగంట అయింది ఇంకా రాలేదు. పాపం మధ్యాహ్నం కదా ఆకలేసినట్టు ఉంది తినేసి వస్తాడు అనుకున్నాను. ఎంతకీ రాలేదు. కాసేపు ఉన్నాక "అవినాష్...!!!" అంటూ గట్టిగా పిలిచాను. "మా అబ్బాయి రాడులేమ్మా నువ్వు వెళ్ళు" అని వాళ్ళ అమ్మ గారు ఇంట్లోంచి సమాధానం చెప్పారు. నాకేం అర్థం కాలేదు. పోనీ మధ్యాహ్నం స్కూల్ కైనా పంపుతారు కదా వస్తాడులే అని ఇంకో అరగంట బయట కూర్చున్నాను. ఎంతకీ రాడే. మధ్యాహ్నం రెండు గంటలయింది ఎర్రటి ఎండలో కాలే బండ మీద అంతే కూర్చున్నాను. ఇంతలో అవినాష్ వాళ్ళ ఎదురింటి ఆవిడ నన్ను చూసింది "బాబు ఏంటి ఇందాక నుంచి ఇక్కడే కూర్చున్నావు?" అంది. "నేను అవినాష్ కోసం వెయిట్ చేస్తున్నా" అన్నాను.
"నువ్వు రోజు పొద్దున్నే ట్రైన్ కి వెళ్లే ఆ మాస్టారు కొడుకువి కదూ" అంది నాకు గుండెలు గుభేలుమన్నాయి. "నువ్వు అప్పుడప్పుడు మీ నాన్నతో పాటు వెళ్లడం నేను చూశాను. మీ నాన్న నాకు తెలుసు" అంది. ఇంతలో అవినాష్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది. "చూడమ్మా మీ అబ్బాయి కోసం ఈ అబ్బాయి చాలా సేపటినుంచి ఇక్కడే కూర్చున్నాడు" అంది ఆ ఎదురింటి ఆవిడ. "అదేంటబ్బాయి నిన్ను ఇందాకే వెళ్ళిపొమ్మని చెప్పా కదా" అంది వాళ్ళ అమ్మ. నీళ్లు నమిలా నేను.
"ఈ అబ్బాయి రోజూ పొద్దున్నే ట్రైన్ కి వెళ్ళే సాంబయ్య మాస్టర్ వాళ్ళ అబ్బాయి" అంది ఆ ఎదురింటి ఆవిడ. "అవునా... నాకూ ఆయన తెలుసు" అంది అవినాష్ వాళ్ళ అమ్మ.
అబ్బో ఇక ఇక్కడుంటే ఏదో తేడాగా ఉంది. పొరపాటున ఈ విషయం మా నాన్నకు తెలిస్తే, ఆయన ఇక్కడకు వచ్చి మరీ నన్ను కొడతాడు అని, నా ఎస్కేప్ ప్లాన్ ని క్యాన్సిల్ చేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి ఇంటికి వచ్చేశా. అలా అనంతపురం పారిపోదామనుకున్న నేను... అవినాష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పారిపోయి మా ఇంటికి వచ్చేశా. ఆరోజు ఎందుకు లేట్ గా తినడానికి వచ్చావు అని మా అమ్మ అడగలేదు. నేను కూడా చెప్పలేదు. తర్వాత కొన్ని రోజుల పాటు నేను అవినాష్ గాడితో మాట్లాడలేదు. తర్వాత మళ్లీ ఎప్పటికో మాట్లాడినా, ఆరోజు వాడు ఇంట్లోంచి ఎందుకు బయటకు రాలేదో నేను ఇప్పటికీ అడగలేదు.
ఇది జరిగిన ఎన్నో ఏళ్ళకి రీసెంట్ గా మా అమ్మా నాన్నకి అప్పట్లో నా ఫెయిలయిన ఎస్కేప్ ప్లాన్ చెప్పాను. ఓరి పిచ్చోడా అంటూ వాళ్ళు తెగ నవ్వుకున్నారు. అలాగే నా వైఫ్ కి కూడా చెప్పాను "పారిపోవాల్సింది పీడ విరగడ అయ్యేది" అంది నవ్వుతూ. 🥴🥴
అదీ ఫెయిల్ అయిన నా ఎస్కేప్ ప్లాన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి